calender_icon.png 3 November, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరి 1 నుంచి ప్రజా చైతన్య పాదయాత్ర

02-11-2025 11:54:57 PM

టిఆర్‌ఎస్ (డి) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ..

ముషీరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి టిఆర్‌ఎస్ (డి) ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రకు ప్రజా చైతన్య పాదయాత్రగా శ్రీకారం చుట్టడం జరిగిందని టిఆర్‌ఎస్ (డి) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు పది రోజుల చొప్పున టైం కేటాయిస్తూ 12 వందల కిలోమీటర్ల మేరకు పాదయాత్రను  చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా చైతన్య పాదయాత్రలో భాగంగా రైతులను నేరుగా కలిసి పంట పొలాలను సందర్శించి వారి కష్టనష్టాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. మహిళలను, నిరుద్యోగులను నేరుగా కలుసుకొని వారి ఉపాధి అవకాశాలు గూర్చి చర్చించడం జరుగుతుందన్నారు.

ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత గృహ నిర్మాణం, ఉద్యోగ అవకాశాల కల్పన, రైతు రక్షణ, మహిళా సంఘాలు, పెన్షన్స్ సౌకర్యం, జయశంకర్ క్యాంటీన్ లు, ఉచిత రేషన్, పెళ్ళికానుక, అమ్మ దీవెన, తెలంగాణ ఉద్యమకారుల బోర్డు, మహిళా సంక్షేమం, దీపం పథకం, ప్రమాద బీమా వంటి పథకాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తూ ప్రజా చైతన్య పాదయాత్ర ముందుకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు కుమ్మరి బాలరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పూణేమ్ సీత, రాష్ట్ర కమిటీ సభ్యులు పార్వతి, పాల్వంచ డివిజన్ ప్రెసిడెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.