09-10-2025 12:00:00 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) పరిధిలో పట్టా, అసైన్డ్ భూముల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించుటకు సంబంధించిన చర్చలు బుధవారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతులతో కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, కుడా వైస్ చైర్మన్ ఛాహత్ బాజ్ పాయ్, పీవో అజిత్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులకు ప్రొజెక్టర్ సాయంతో ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్) వచ్చే ప్రాంతాలను చూపిస్తూ, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో జరిగే అభివృద్ధి, దాని ప్రయోజనాల ను అధికారులు వివరించారు. రైతుల్లో నెలకొన్న అనుమానాలు, భయాలు తొలగించే విధంగా సవివరంగా అవగాహన కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతుల నుండి సేకరించే భూములను న్యాయమైన విధానంలో అభివృద్ధి చేస్తాం. ప్రతి రైతుకు నష్టం కాకుండా లాభం చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని హామీ ఇచ్చారు. రైతులు కూడా సానుకూలంగా స్పందించి, నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని కోరారు.