13-05-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, మే 12 (విజయక్రాంతి): ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులను కలెక్టర్‌కు అందించారు.
దీనిపై స్పందించిన కలెక్టర్, ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించాలంటూ శాఖల అధికారులకు స్పష్టమై న ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను శాఖల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, పరిష్కార వివరాలను రిమార్కుల విభాగంలో నమోదు చేయాలని సూచించారు. సమస్య పరిష్కారానికి సంబంధించిన సమాచారం దరఖాస్తుదారులకు తప్పనిసరిగా తెలియజేయాలన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన టెలిఫోన్ ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫోన్ల ను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలిచ్చారు. దూర ప్రాంతా ల ప్రజలు 91005 77132 నంబరును సంప్రదించి వాట్సాప్ ద్వారా సమస్యలు పంపవచ్చునని కలెక్టర్ తెలిపారు.
ప్రజావా ణి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని, అభ్యంతరాలను స్వీకరించాలని తెలిపారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులను మండల స్థాయిలో త్వరితంగా పరిశీలించి బ్యాంకులకు పంపించాలని సూచించారు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఉపాధి హామీ పనుల్లో త్రాగునీరు, టెంట్, ఓఆర్‌ఎస్ పొట్లాల అందుబాటును ఉంచాలన్నారు.
ఇటీవల రుణాల మంజూరులో రాష్ర్టస్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిచిన గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులకు, సిబ్బందికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.