08-07-2025 01:12:48 AM
- కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూలై ౭ (విజయక్రాంతి): ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రజల సమస్యలు పరిష్క రించాలని సూచించారు. భూభారతి చట్ట అమలుపై తహసీల్దార్లు కచ్చితంగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వనమహోత్సవం సందర్భంగా మొక్కల నాటే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
త్వరలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుల అధ్యక్షతన నిర్వహించనున్న దిశా కమిటీ సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలపై సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు.జూలై 9న జిల్లా కేంద్రంలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, న్యాయనిపుణులు పాల్గొని చట్ట విశ్లేషణ చేస్తారని పేర్కొన్నారు. అంతేకాక, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని, ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ దినోత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.