23-09-2025 12:00:00 AM
-జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను జిల్లా అధికారులు తమ వద్ద పెండింగ్ లేకుండా చూడాలని, దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలని అన్నారు.
కారుణ్య నియామకాలు చేపట్టేందుకు జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కార్యాలయ సబార్డినేట్ ఖాళీ పోస్టుల వివరాలను వారం రోజులలో పంపాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. యూడైస్ పోర్టల్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) ప్రకారం విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ లేని పాఠశాలలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని, అక్కడ ఆ వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
జిల్లా అధికారులు తప్పనిసరిగా సంక్షేమ వసతి గృహాల తనిఖీ ప్రతి వారం నిర్వహించి, భోజన నాణ్యత వివరాలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం నగరం పాకబండ బజార్ కు చెందిన ఎం. హరి శ్రావణ్ కుమార్ తనకు రేషన్ షాపులలో ఏదైనా డీలర్ షిప్ ఇప్పించి జీవన ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా పౌర సరఫరాల అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన రత్నకుమారి, పుష్ప, భద్రమ్మ తమకు సర్వే నెంబర్ 1123 లో భూ పంపిణీ పథకం క్రింద కేటాయించిన భూమికి ఇతరులు బాటను కబ్జా చేశారని, ఆ బాటను ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.