calender_icon.png 31 August, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలాజీ బాబా ప్రవచనాలు, ధ్యాన బోధలు స్ఫూర్తిదాయకం

30-08-2025 05:59:23 PM

ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ శ్రీ శ్రీ సద్గురు పూలాజీ బాబా ప్రవచనాలు, ధ్యాన బోధలు స్ఫూర్తిదాయకమని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గొడం నగేష్ అన్నారు. శనివారం జిల్లాలోని జైనూర్ మండలం పాట్నాపూర్ గ్రామంలో గల సిద్దేశ్వర సంస్థాన్ లో నిర్వహించిన పూలాజీ బాబా 101వ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా ఎస్. పి. కాంతిలాల్ సుభాష్, కిన్వాట్ నియోజకవర్గ శాసనసభ్యులు భీమ్ రావు కేరం, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులతో హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ... పూలాజీ బాబా చూపిన ఆధ్యాత్మిక, ధ్యాన సన్మార్గాలు ఎంతో గొప్పవని, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో బాబా ప్రవచనాలు, బోధనల వల్ల ఎన్నో కుటుంబాలు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నాయని తెలిపారు. సమాజంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆధ్యాత్మిక సన్మార్గాన్ని చూపిన మహనీయుడని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పూలాజీ బాబా ప్రజల జీవితాలలో మార్పు రావాలని చేసిన ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయమని, మహనీయులు అందించిన బోధనలు ముందు తరాల వారికి అందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

ప్రజలంతా ఆధ్యాత్మిక శాంతి మార్గంలో నడవాలని, మానవ సేవయే మాధవ సేవగా పులాజీ బాబా కృషి చేశారని తెలిపారు. ప్రతి మనిషి పని చేసుకుంటూ తాను అనుకున్న పనులు అవుతాయనే నమ్మకంతో సన్మార్గంలో నడవాలని తెలిపారు. పూలాజి బాబా తపస్సు చేసిన దామాజీ లోయకు రోడ్డుతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కృషి చేస్తామని తెలిపారు. పూలాజీ బాబా జయంతి వేడుకలకు హాజరైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

 వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఆధ్యాత్మిక మార్గాలపై ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాటు, అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ సమన్వయంతో బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం సద్గురు పూలాజీ బాబా జీవిత చరిత్ర, ప్రవచనాల ధ్యాన మార్గాలపై మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ కొటు కులే, భక్తురాలు కమల రచించిన గ్రంథాలను, క్యాసెట్ ను ఆవిష్కరించారు. జయంతి వేడుకలలో పాల్గొన్న భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.