calender_icon.png 13 November, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పు ఎగవేతదారులకు దండన

12-11-2025 12:00:00 AM

పాలకుర్తి రామమూర్తి :

* వస్తు ఉత్పత్తులు, సేవలు దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు. ఉత్సాహం, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల సమూహం.. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన సొమ్మును బ్యాంకుల ద్వారా, స్టాక్ మార్కె ట్ల ద్వారా, డిబెంచర్ల ద్వారా సమకూర్చుకుంటారు. 

చిరప్రవాసః సంస్తంభ ప్రవిష్టో 

వా మూల్య ద్విగుణం దద్యాత్..

(కౌటిలీయం - 3--11)

అప్పు తీసుకొని చాలా కాలం దేశాంతరాల్లో ఉండిపోయినవాడు, మొండితనం తో ఎన్నిమార్లు అడిగినా సొమ్ము తిరిగి ఇవ్వనివాడు.. అసలుకు రెట్టింపు ఇవ్వాలి అంటాడు ఆచార్య చాణక్య. అవసరాలకు అప్పు తీసుకోవడం.. వడ్డీతో అసలును నిర్ణీత సమయానికి చెల్లించడం అనాదిగా వస్తున్న ప్రక్రియే. అప్పు ఇచ్చిన వారి హక్కులను, తీసుకున్న వారి హక్కులను కాపాడడం పాలకుల కర్తవ్యం. అప్పు తీసుకోవడం, తిరిగి చెల్లించడం, అప్పు తీసుకు న్న వారు మరణిస్తే ఆ బాధ్యతనెవరు తీసుకోవాలనే అంశాన్ని చాణక్య విస్తృతంగా చర్చించాడు.

సాధారణ జనాల మధ్య జరిగే లావాదేవీలకు నూటికి ‘ఒకటింబా వు’ వడ్డీని, వ్యాపారానికి తీసుకున్న సొ మ్ముకు నూటికి ఐదు శాతం వడ్డీని ధర్మ సమ్మతమని నిర్ణయిస్తూ.. అంతకు మించి వడ్డీని వసూలు చేసినా, ఇచ్చినా, దానికి సాక్షిగా ఉన్నా.. వారికీ  దండనను చెప్పారాయన. వ్యక్తి ప్రవర్తన, వ్యక్తి ముఖ విలు వను పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. శీలవంతుల మధ్య జరిగే లావాదేవీలు చట్ట బద్ద్ధంగానూ, న్యాయబద్ధంగానూ ఉంటాయి.

నైతికత, సమగ్రత కలిగిన వారి ని శీలవంతులుగా చెబుతారు. అప్పటి చ ట్టం ప్రకారం.. ఋణం ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు దాటితే ఋణదాత ఇచ్చిన అప్పుపై హక్కును కోల్పోతాడు. కాబట్టి అప్పు తీసుకున్న వారు అప్పును చెల్లించాల్సిన అవసరం లేదు. అది చట్టబద్ధత.. కా ని తీసుకున్న ఋణాన్ని పది సంవత్సరా లు దాటినా తిరిగి చెల్లించడం న్యాయబద్ధ త. శీలవంతుడైన వ్యక్తి న్యాయంగా ప్రవర్తి స్తాడు.

శీలం లేని వ్యక్తి చట్టాన్ని అడ్డుపెట్టుకొని అప్పును ఎగవేసే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య అవసరాల కు అప్పులు చేయడం..దానికి నిర్ణీత వడ్డీని చెల్లించడం.. ఆ లావాదేవీల్లో భేదాభిప్రాయాలు వస్తే న్యాయస్థానాలకు వెళ్ల డం సాధారణం. అలాంటి సమయంలో రాజు.. అప్పు ఇచ్చినవారి, తీసుకున్నవారి చరిత్రను పరీక్షించి నిర్ణయించాలని అంటారాయన.

అవినీతి వ్యాపారవేత్తలు

వస్తు ఉత్పత్తులు, సేవలు దేశ ఆర్థికాభివృద్ధికి పునాదులు. ఉత్సాహం, విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం.. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు అవసరమైన సొమ్మును బ్యాంకుల ద్వారా, స్టాక్ మార్కె ట్ల ద్వారా, డిబెంచర్ల ద్వారా సమకూర్చుకుంటారు. సొమ్మునెలా సమకూర్చుకు న్నా అది ప్రజల సొమ్మే. వ్యక్తులకు లేదా సంస్థలకు వ్యాపార అవసరాలకై అప్పులి చ్చే సమయంలో.. బ్యాంకులు ఆ వ్యక్తుల/ సంస్థల ఆర్థిక స్తోమత, చేయబోయే వ్యా పారాలకు సంబంధించిన పూర్తి వివరాలు విశ్లేషణ చేసుకొని.. సమర్పించిన పూచీకత్తు పత్రాలను పరిశీలించి.. అవసరమైన నిబంధలను పాటిస్తూ ఋణాలను మం జూరు చేస్తాయి.

అయితే నియమాలన్నీ సాధారణ జనాలకే పరిమితమౌతూ.. శక్తివంతమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ పలుకుబడులు గలిగిన వారికి వర్తించడం లేదు. నైతికతకు ప్రాధాన్యతనివ్వని పలు సంస్థలు/ వ్యక్తులు అవినీతి మార్గంలో వా రి పరపతిని ఉపయోగించుకొని బ్యాంకు లు, వివిధ సంస్థల నుంచి అనేక మార్గాల్లో అధిక మొత్తంలో ధనాన్ని సమకూర్చుకొని ఎగవేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అవినీతిపరులైన వ్యాపారవేత్తలు డొల్ల కంపెనీల మధ్య లావాదేవీలను సృజించి అప్పులు తీసుకొని.. ఆ ధనాన్ని ఇతర దేశాల్లో స్వం త ఆస్తులను పెంచుకునేందుకై వినియోగిస్తున్నారు. అలాంటి సంస్థల పనితీరు అధ మంగా ఉన్నా వాటికి ఎక్కువగా రేటింగ్స్ ఇచ్చే సంస్థలూ, రాజకీయ నాయకుల అం డదండలు, చట్టాల్లోని లొసగులు, ఆడిట్ చేసి ఉత్తమమంటూ సర్టిఫికేట్లు జారీ చేసే సంస్థల అక్రమాలు సహకరిస్తున్నాయి. 

ప్రభుత్వం ఏం చేస్తుంది?

ఈ మధ్యే వెలుగుచూసిన అనిల్ అం బానీ సంస్థల వ్యాపార లావాదేవీల్లో 2006 నుంచి దాదాపు 42 వేల కోట్ల రూ పాయల మోసాలు జరిగాయనే వార్త మదుపరుల్లో సందిగ్ధతను, ఆందోళనను కలిగిస్తూ స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారానికై సమకూర్చుకున్న నిధులను స్వంత ప్రయోజనాలకై విదేశాలకు మళ్లించారని ఆయనపై అభియోగం. మనీలాండరింగ్ కేసులో ఆయన కు చెందిన 7,500 కోట్ల ఆస్తులను ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్’ (ఈడీ) జప్తు చేసిందని పత్రికలో చదివాము.

ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. వంద ల్లో అప్పుబడిన సాధారణ వ్యక్తులను జైలుకు పంపే ప్రభుత్వ యంత్రాంగం ఇంత పెద్ద మోసాన్ని ఎందుకని ఉపేక్షిస్తున్నది? ఎవరి రక్షణ వల్ల ఇంతటి మోసంపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది? నిబంధలను తుంగలో తొక్కి డొల్ల కంపెనీలకు బ్యాంకులెలా అప్పులిచ్చాయి? కొన్ని సందర్భాల్లో అప్పు మంజూరు కాకముందే సొమ్మును వారి ఖాతాలోకి బదిలీ చేశారట. అదెలా సాధ్యపడింది? ఆడిట్ చేసిన సంస్థలు.. లొసుగులను గుర్తించి ఎరుపు ఫ్లాగ్స్ పెట్టిన అంశాలను పట్టించుకోలేదనే అపవాదు ఉన్నది.. అదెంతవరకు సత్యం, దానికి బాధ్యులు ఎవరు?.

ఉచితమనే భావన..

ఈ ఉదంతం.. వ్యాపార దిగ్గజాల లావాదేవీలపై ఈడీ దృష్టిని కేంద్రీకరించి.. ఆర్థిక నేరాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ను, వ్యాపార రంగాన్ని నిలకడగా ఉంచాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. బ్యాం కులు అప్పులు ఇచ్చే సమయంలో అది ప్రజల సొమ్మని గుర్తించడం.. నిబంధలను కఠినంగా అమలు చేయడం అవసరం. బ్యాంకులు తమ అప్పులను తిరిగి సాధించడంలో అన్ని మార్గాలు ప్రయత్నించాలి.. వారికి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు పూర్తి గా సహకరించాలి.

భారతీయ మార్కెట్ ప్రతికూలతలను అధిగమించే సామర్ధ్యం ఉన్నదే అయినా.. మదుపరులు సొమ్ము ను మదుపుచేసే సమయంలో ఆయా సంస్థల నిజాయితీని పలు కోణాల్లో విశ్లేషించుకొని పెట్టుబడి పెట్టాలి. ప్రజల్లో అలసత్వం, స్వల్పకాలిక ప్రయోజనాలపై అమితాసక్తి, అన్నీ ఉచితంగా రావాలనే భావన ఉన్నంతకాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలకై పోరాడేందుకు ఏనాడూ ఉద్యమించని ప్రజలు తాయిలాలకై ఆరాటపడతారు.

స్వంత ప్రయోజనా లకై ఉద్యమిస్తుంటారు. గతంలో ఇలాంటి మోసాలెన్నో జరిగాయి. ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నులు, కడుపు మాడ్చుకొ ని దాచుకున్న నాలుగు రాళ్లే.. బ్యాంకులు బడా బాబులకు ఋణాలుగా సమకూరుస్తాయి. ఆ సొమ్మును అక్రమార్కులు అక్ర మంగా తరలించుకుపోతుంటే.. నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు వారికి సహకరిస్తున్నారు.

ప్రజాచైతన్యం మాత్రమే ఇలాంటి మోసాలను అరికడుతుంది. దేశమైనా, వ్యక్తులైనా ఆర్థిక ప్రగతికై అప్పుచేయడం తప్పుకాదు.. అయితే దానిని నిర్దేశిత కార్యానికి వినియోగిస్తేనే ప్రగతి, సుగతి. జీవి తంలో ఎదురయ్యే అవకాశాలు, అవరోధాల మధ్య సమన్వయాన్ని సాధించడమే స్థితప్రజ్ఞత.