calender_icon.png 1 July, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..

23-04-2025 07:57:47 PM

కుర్తివాడ పాఠశాల వార్షికోత్సవంలో ఎంఈఓ ప్రతాప్ రెడ్డి...

పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన అందుతుందని మండల విద్యాధికారి ప్రతాపరెడ్డి(Mandal Education Officer Pratap Reddy) పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మండల పరిధిలోని కుర్తివాడ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రంగాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారని వారిచేత విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం జరుగుతుందన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కుర్తివాడ పాఠశాలలో వార్షికోత్సవ సంబరాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏ రంగాల్లో అయినా ప్రవేటు పాఠశాలలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యాభోధన సాగుతుందన్నారు. అదే విధంగా క్రీడలు, ఇతర సాంసృతిక కార్యక్రమాల్లో సైతం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరుస్తూన్న విషయాన్నీ ఆయన ప్రస్థావించారు. అంతకుముందు వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేసిన తీరు సభికులను ఆకట్టుకుంది. విద్యార్థులు గ్రామంలో బతుకమ్మ, బోనాలతో ప్రదర్శన నిర్వహించారు.

సాంసృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఆడి పాడిన తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు, తిలకించేందుకు వచ్చిన అతిథులు, గ్రామస్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెగ్య నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి హాజరైన అతిథులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, నవీన్, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పాఠశాల సిబ్బంది జనార్ధన్, శ్రీనివాస్, మల్లేశం, లావణ్య, స్వప్న,గ్రామ పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.