26-01-2026 02:44:35 AM
మొయినాబాద్, జనవరి 25 (విజయ క్రాంతి): విద్యార్థులకు సృజనాత్మకమైన, నాణ్యమైన విద్యను అందించినప్పుడే వారు సమగ్రంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న శ్రీ శివ సాయి పబ్లిక్ స్కూల్ 25వ వార్షికోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల కరస్పాండెంట్ గోపాలరావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ప్రసంగించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య లు మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తు అని, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యాలపై ఉందన్నారు. కేవలం లాభాలకే ప్రాధాన్యం ఇచ్చే విద్యా విధానాలకు ముగింపు పలికి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యను అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తాను ఈ పాఠశాలకు 13 సార్లు వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం గర్వకారణమని అన్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. మారుమూల గ్రామాల్లో పేద విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరవడం తన చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.