calender_icon.png 5 November, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంటల నష్టం వివరాలను త్వరగా నమోదు చేయండి

05-11-2025 12:10:26 AM

హనుమకొండ  కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ, నవంబర్ 4 (విజయ క్రాంతి): భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు త్వరగా నమోదు చేసి నివేదికను అందజేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో  కలెక్టర్ మాట్లాడారు. ధర్మసాగర్ దేవునూరు ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు, వంతెన, వరి పంటలు దెబ్బతినగా కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లి అధికారులు, స్థానికులతో కలిసి పరిశీలించారు.   వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ లో దెబ్బతిన్న పంటల వివరాల నమోదు చేస్తున్న సమాచారాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ జిల్లా కలెక్టర్ కు వివరించారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో  దెబ్బతిన్న  పంటల వివరాలను సర్వే నంబర్లు, రైతుల వారీగా వివరాలను నమోదు చేయాలన్నారు. స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లాడి వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. స్థానిక చెరువు నుండి వచ్చిన వరద నీటితో దెబ్బతిన్న  రోడ్లను, పంట నష్టాన్ని  కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు వెంటనే ప్రారంభించాలని , అందుకు సంబంధించిన ప్రతిపాదిత అంచనాల నివేదికను అందజేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారామ్, డిఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ మంగీలాల్, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, ఏవో రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.