05-11-2025 12:11:42 AM
-జైలు పరిచయాలు.. జల్సాలకు అలవాటు
-సరదాలు తీరడానికి దొంగతనాలు
-నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అరెస్టు
ఎల్బీనగర్, నవంబర్ 4 : నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మంగళవారం నాగోల్ పోలీస్ స్టేషన్ లో అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయినగర్ కాలనీలో రోడ్డు నంబర్ 1లో రిటైర్డ్ ఉద్యోగి భాస్కర్ భార్య ప్రమీలతో కలిసి ఉంటున్నాడు. వీరి ఇద్దరు కూతుర్లు అమెరికాలో స్థిరపడ్డారు. గతనెల 17న అమెరికాకు వెళ్లే ముందు భాస్కర్ భార్య ప్రమీలతో కలిసి ఇంటికి తాళం వేసి, బామర్ది శ్రీనివాస్ కు ఇల్లును చూడమని చెప్పి వెళ్లారు. అయితే, గత నెల 30వ తేదీన భాస్కర్ ఇంటిలో తెల్లవారుజామున ఇంట్లో లైట్ వెలుగుతుండగా ఎదురు ఇంటివాళ్లు శ్రీనివాస్ కి సమాచారం ఇచ్చారు.
అతడు వచ్చి చూడగా ఇంటిలో వస్తువులు చిందర వందరగా పడి ఉండడం, కిటికీ గ్రిల్స్ వంచి ఉన్నాయి. శ్రీనివాస్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పరిశీలించారు. సీసీ కెమెరాలు, నిందితుల వెలి ముద్రలను సేకరించారు. వీటి ఆధారంగా ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను సోమవారం నాగోల్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి రూ,30 లక్షల విలువ జేసే బంగారు ఆభరణాలు, కిలో వెండి, ఒక మొబైల్ ఫోన్, హోండా యాక్టివా బైక్ ను స్వాధీనం చేసుకున్నారు.
జైలులో పరిచయం
సూర్యాపేట జిల్లాకు చెందిన కిన్నెర మధు(37), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాకు చెందిన ఉప్పులూరి నవీన్ కుమార్ అలియాస్ నవీన్(35) ఇద్దరు జైలులో పరిచయం ఏర్పడింది. కిన్నెర మధుపై 25పైగా దొంగతనం కేసుల్లో ఉన్నాయి. నల్గొండ , రాచకొండ, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదై కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. 2018లో కోదాడ పోలీస్ స్టేషన్ లో కిన్నెర మధుపై పీడీ యాక్ట్ నమోదు చేశారని అడిషనల్ డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు.
కాగా, నవీన్ జులై నుంచి బయటకు వచ్చి హోటల్ లో పని చేస్తూ ఎల్బీనగర్ లో ఉంటున్నాడు. నవీన్ దగ్గరికి మధు వచ్చి... ఇక్కడే దొంగతనాలు చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నాగోల్ లోని సాయినగర్ కాలనీలో భాస్కర్ ఇంటిలో దొంగతనం చేశారు. ఆధారాలు సేకరించి, ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. మంగళవారం రిమాండ్ కు తరలించారు. సమావేశంలో నాగోల్ సీఐ మక్బూల్ జానీ, ఎల్బీనగర్, సరూర్ నగర్ పోలీసులు పాల్గొన్నారు.