calender_icon.png 26 August, 2025 | 8:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు చోరీపై రాహుల్‌గాంధీ పోరాటం

26-08-2025 02:41:45 AM

  1. అంబానీ, ఆదానీల కోసమే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది
  2. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 
  3. బలహీన వర్గాల అభ్యున్నతికి మారుపేరు కాంగ్రెస్ 
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
  5. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర

వరంగల్/కరీంనగర్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఓటు చోరీపై రాహుల్‌గాంధీ అలుపె రుగని పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌ను అడిగినా సమాధానం ఇవ్వడం లేదన్నా రు. పేదల సంక్షేమం కోసమే కేంద్రంతో రాహుల్‌గాంధీ పోరాటం చేస్తున్నారని చెప్పారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఆదాని, అంబానిల కోస మే పని చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని   కాపా డుకుంటామని చెప్పారు.

కాంగ్రెస్ జన హితయాత్ర రెండో విడత యాత్ర సోమవారం సా యంత్రం వరంగల్ జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలోని వర్ధన్నపేట ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌కు చేరుకున్న యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. జనహితమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని అన్నారు.

సామాజిక న్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని చెప్పారు. ఈ యాత్రలో మంత్రి కొండా సురేఖ, వద్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ , యశస్విని రెడ్డి, డాక్టర్ భూక్య మురళి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

జనహిత యాత్రలో పాల్గొన్న పిసిసి ప్రెసిడెంట్, రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జ్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో విప్ ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.