calender_icon.png 17 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థర్డ్‌లైన్ పనితీరును పరిశీలించిన రైల్వే సేఫ్టీ కమిషనర్

17-09-2025 01:03:51 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కాజీపేట డోర్నకల్ సెక్షన్ లో నూతనంగా నెక్కొండ - మహబూబాబాద్ వరకు నిర్మించిన థర్డ్ లైన్ రైల్వే ట్రాక్ పనితీరును దక్షిణ మధ్య రైల్వే జోన్ సేఫ్టీ కమిషనర్ మాధవి, డిఆర్‌ఎం గోపాలకృష్ణ పరిశీలించారు. మహబూబాబాద్ నుంచి తాళ్లపూస పల్లి, కేసముద్రం, ఇంటికన్నె, నెక్కొండ రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక సెలూన్, ట్రాలీ పై రైల్వే ట్రాక్ మీద ప్రయాణించారు.

ఇటీవలే థర్డ్ లైన్ పనులు పూర్తి చేయగా, ఓహెచ్‌ఈ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి వెళ్లారు. తాజాగా సేఫ్టీ కమిషనర్ పరిశీలన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇస్తే నెక్కొండ నుంచి మహబూబాబాద్ వరకు థర్డ్ లైన్ పై రైళ్ల రాకపోకలు ప్రారంభిస్తారు. ఇప్పటికే కాజీపేట నుండి నెక్కొండ వరకు థర్డ్ లైన్ పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.

తాజాగా మహబూబాబాద్ వరకు థర్డ్ లైన్ పనులు పూర్తి కావడంతో ఇకనుంచి కాజీపేట నుండి మహబూబాబాద్ వరకు థర్డ్ లైన్ పై రైళ్ల రాకపోకలు సాగనున్నాయి. థర్డ్ లైన్ వినియోగంలోకి వస్తే రైళ్ల రాకపోకలకు మరింత అణువుగా మారనుంది. గూడ్స్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ మార్గంలో ఇక ఎలాంటి అడ్డంకి ఉండదని అధికారులు తెలిపారు. 

నాలుగో ఫ్లాట్ ఫామ్ నిర్మించాలి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ తో పాటు కేసముద్రం రైల్వే స్టేషన్ల వద్ద ప్రస్తుతం ఉన్న నాలుగు రైల్వే ట్రాక్ లకు అదనంగా రెండు రైల్వే ట్రాకులు నిర్మించిన నేపథ్యంలో నాలుగో ఫ్లాట్ ఫారం నిర్మించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, వివిధ పార్టీల ప్రతినిధులు రైల్వే డిఆర్‌ఎం గోపాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం మూడో ప్లాట్ఫామ్ తో సరిపెడుతున్నారని,

నాలుగో లైన్ లో రైలు వస్తే ప్రయాణికులు రైలు ఎక్కి దిగడం కష్టంగా ఉంటుందన్నారు. అలాగే ఆయా రైల్వేస్టేషన్లలో అదనపు సౌకర్యాలు కల్పించాలని, బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని,  కొత్తగా రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, గతంలో హాల్టింగ్ ఉన్న రైళ్లకు కరోనా సమయంలో తొలగించి పునరుద్ధరించలేదని, ఇప్పుడు ఆ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.