28-08-2025 04:55:06 PM
ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలి..
జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అలెర్ట్ గా ఉండాలని ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(District Collector Sathya Prasad) ఆదేశాలు జారీ చేశారు. గురువారం జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ధర్మపురి గోదావరి నది తీరాన్ని పర్యటించారు. అనంతరం కలెక్టర్.. ఎస్పీ కలిసి ధర్మపురి గోదావరి నది పరిసరాలు, రాయపట్నం బ్రిడ్జి, నేరెళ్ల లో లెవెల్ వంతెన, జగిత్యాల మండలం అనంతారం బ్రిడ్జి, అలాగే రాయికల్ మండలంలోని రామోజీపేట, మైతాపూర్, ఇటిక్యాల లో లెవెల్ వంతెనలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
అధికారులతో మాట్లాడిన కలెక్టర్ వర్షాల ప్రభావం, నీటి ప్రవాహాల స్థితిపై సమాచారం సేకరించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంతెనలు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ప్రజలంతా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ నిరంతరం జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని ఎక్కడ ఎలాంటి తప్పిదాలకు చోటివ్వకుండా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్, మండల తహసిల్దార్లు, ఎంపీడీవోలు సంబంధిత అధికారులు న్నారు.