23-05-2025 01:21:27 AM
మహబూబాబాద్, మే 22 (విజయ క్రాంతి): యాసంగి సీజన్ లో పండిన ధాన్యం విక్రయాలు చి‘వరి’ దశలో ఉన్న సమయంలో అకాల వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు ధాన్యాన్ని వర్షం నుండి కాపాడుకోవడానికి అరి కోసం పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 239 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ళు ఆఖరి అంకానికి చేరుకున్నాయి.
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో రైతులు పండించిన 1 లక్షా 79 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే 1లక్షా 46 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి తెలిపారు. దాదాపు 70 శాతం పైగా ధాన్యం కొనుగోళ్ళు పూర్తి కాగా, ఇందులో 60 శాతానికి పైగా ధాన్యం మిల్లులకు ఎగుమతి చేసినట్లు చెప్పారు. మరో 10 శాతం దాన్యం బస్తాలు మిల్లులకు ఎగుమతి చేయాల్సి ఉందన్నారు.
అలాగే రైతుల నుండి మరో 30 శాతం వరకు ధాన్యం సేకరించాల్సి ఉందన్నారు. ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏలాంటి ఇబ్బంది లేదని, అకాల వర్షాలతోనే కొంత జాప్యం జరుగుతోందని ఆమె చెప్పారు. ఆలస్యంగా వరి కోతలు చేసిన రైతులకు చివరి క్షణంలో కురుస్తున్న వర్షాలు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులకు గత పది రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ధాన్యం విక్రయాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ మించి ఉంటే కొనుగోలు చేయడానికి నిర్వాహకులు నిరాకరిస్తుండడంతో, ధాన్యాన్ని ఆరబెట్టడం, తీరా విక్రయించే సమయానికి వర్షం కురుస్తుండడంతో ధాన్యం లో తేమ శాతం మళ్ళీ పెరిగి కొనుగోలుకు ఆటంకంగా మారుతుంది.
దీంతో కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పక్షం రోజులకు పైగా ధాన్యం విక్రయించడానికి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల నుండి అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండడం, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లకు చి‘వరి’ దశలో ఆటంకంగా మారింది.
వర్షాల కారణంగా ధాన్యం ట్రాన్స్పోర్ట్, కాంటాలు వేయడం కూడా కష్టతరంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికే మిల్లులకు చేర్చిన ధాన్యం కూడా వర్షానికి తడుస్తుండడంతో మిల్లర్లు కూడా ధాన్యం దిగుమతికి మొగ్గుచూపడం లేదని చెబుతున్నారు.
ఎండాకాలంలో వానాకాలం! సాధారణ స్థాయికి మించి కురిసిన వర్షం
మహబూబాబాద్ జిల్లాలో ఎండాకాలంలో వాన కాలంగా పరిస్థితి మారింది. మే 14 నుండి నెలాఖరు వరకు సాధారణ వర్షపాతం 992.7 మిల్లీమీటర్లు కాగా, ఈనెల 14 నుంచి గురువారం వరకు 1,402.7 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోదవడం విశేషం. సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదు కావడంతో ఎండాకాలంలో వానా కాలాన్ని తలపిస్తోంది.
తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే!
వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని, ఏలాంటి కొర్రీలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని బాగా ఆరబెట్టి విక్రయానికి సిద్ధం చేసినప్పటికీ, లారీల రాక ఆలస్యం కావడంతో పలుచోట్ల కొనుగోళ్లు నిలిచిపోయాయని, ఇంకొన్ని చోట్ల కాంటాలు పెట్టినప్పటికీ ఎగుమతి చేయకుండా నిలిచిపోవడం వల్ల వర్షాలకు ధాన్యం తడిసిందని,
దీనివల్ల రైతులకు నష్టం కలిగించకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూన్నారు. మరో పక్షం రోజుల్లో వానాకాలం సాగు పనులు చేపట్టే పరిస్థితి ఉన్నప్పటికీ, ఇంకా తాము ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.