06-12-2025 12:00:00 AM
ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుతున్నప్పుడు ఎంతో మంది సాహితీవేత్తల ను కలుసుకునేవాణ్ణి. నాకు తోడుగా నా క్లాస్‌మేట్ కొట్టం రామచంద్రారెడ్డిగారుండేవారు. అప్పటికీ కొత్తపల్లి వీరభద్రారావు గారు సికింద్రాబాదులోని వెస్టుమారేడుపల్లిలో ఉండేవారు. ఒక ఉత్తరం నాకిచ్చి దా న్ని వారికి చేరవేయవలసిందిగా ఆచార్య శ్రీహరిగారు నన్ను కోరారు. నేను రామచంద్రారెడ్డితో కలిసి వారింటికి వెళ్లాను.
అక్కడ అదృష్టవశాత్తు నవ్య కవిత్వానికి గురజాడతో పాటు, యుగకర్తగా పేరొందిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు గారి దర్శనమైంది. ఇద్దరం వారి ఆశీర్వాదాన్ని తీసుకోవడం మరచిపోని గొప్ప అనుభవం. కొత్తపల్లి వారికి రాయప్రోలువారు ‘మామ’ అవుతారు. నేను, రామచం ద్రారెడ్డి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లం.
కళాశాలలో ఒకే బెంచీపై కూర్చునేవాళ్లం. మా ఇద్దరికి గాఢమైన స్నేహానుబంధం ఏ ర్పడడానికి కారణం మా క్లాసురూమే. ఆరోజు దివాకర్ల వారి కూతురు గాయత్రీ దేవి మాకు జైమినీ భారతం పాఠం చెబుతున్నారు. ‘సంత్రాసం’ అనే పదం వచ్చిం ది. దానికి సంతోషం అని అర్థం చెప్పారు మేడంగారు. నేను వెంటనే లేచి ‘దాని అర్థం భయమండీ’ అన్నాను. ‘మీది కరెక్టే’ అన్నారు మేడంగారు. అంతటితో క్లాసులో అలజడి మొదలయ్యింది’. ఎవరిది కరెక్టో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం’ అం టూ రామచంద్రారెడ్డి లేచి నిలబడ్డాడు.
గాయత్రీదేవి పాఠం ఆపి క్లాసు నుంచి బయటికి వెళ్లిపోయారు. అంతేకాదు, రెం డు రోజుల తర్వాత కాలేజీకి రానని ప్రిన్సిపాల్ గారికి ఉత్తరం రాశారు. క్లాసు రూం లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మా ప్రధానాచార్యులు కె.కె.ఆర్ నన్ను ఆఫీసుగదిలోకి పిలిపించారు. అప్పుడు నాకు తోడుగా రామచంద్రారెడ్డిగారుండడం ఎం తో నయమైంది. రంగనాథాచార్యులకు సంత్రాసం అంటే భయం అనే అర్థం తెలియనిది కాదు. అంతా విని మమ్మల్ని పొమ్మన్నారు. అట్లా మొదలైంది రామచంద్రునితో నా స్నేహం.
గుడ్‌బై చెప్పేవాణ్ణే!
నాది నిరుపేద చేనేత కుటుంబం. ఇంటినుంచి ఒక్క పైసా వచ్చేది కాదు. సం పాదించుకొని చదువుకోవాలి. నిజానికి ఆ కాలంలో నాలాంటి వారికీ పరిస్థితి తప్పనిసరి. రామచంద్రారెడ్డిది అప్పటి షాద్‌నగర్ తాలుకాలోని మంగళగుడా చిన్నగ్రామం. వ్యావసాయిక కుటుంబం. నాన్నగారు, అన్నదమ్ములు వ్యవసాయం చేసేవారు. హైదరాబాదుకు సమీపంలో ఉండడం వల్ల, ప్రతిరోజు వచ్చే సర్వీసులో వారి ఊరి నుంచి ఏదో ఒకటి వచ్చేది.
హుస్నేన్ ఆలంలో సర్వీసు ఆగుతుంది గనుక వారు గౌలిపురాలో నివాసం చేయడానికి నిశ్చయించారు. అప్పటికే నేను విశ్వకర్మ హాస్టల్ (తిలక్ రోడ్డు)లో ఉండి చదువుకుంటున్నవాణ్ణి. గన్‌ఫౌండ్రీలో ఉన్న ముని మాణిక్యం నరసింహారావు ప్రఖ్యాత హాస్య రచయిత గారికి లేఖకునిగా పని చేయడం వల్ల వచ్చే పదిహేను రూపాయలే నా సంపాదన. ఎట్లాగో నెలకు సరిపుచ్చుకునేవాణ్ణి. హాస్టల్లో రూం అద్దె నెలకు ఒక్క రూపాయే గనుక బ్రతికిపోయాను.
నాకు మిత్రుల సహాయం లేకపోతే చదువు మానేసి హైదరాబాదుకు గుడ్ బై చెప్పేవాణ్ణే. కాని రామచంద్రారెడ్డి తనతో కలిసి గౌలిపురాలో ఒక గదిలో ఉండి చదువుకోవడానికి నిశ్చయించాడు. మాకు తోడుగా కృష్ణారెడ్డి ఉండడం వల్ల రూం అద్దె ఏడు రూపాయలను షేర్ చేసుకోవడం సులభమైంది. ప్రతిరోజు దగ్గర్లో ఉన్న గుండేరావును దర్శించే అవకాశం లభించింది.
జంట సంపాదకుల్లాగా..
కొన్ని రోజుల తర్వాత రామచంద్రారెడ్డిగారు ‘గాయత్రీ మేడం మిమ్మల్ని గుర్తు చేశారని చెప్పేసరికి, జరిగిందేమిటో చెప్పమని అడిగాను. రామచంద్రారెడ్డి అందరి తో కలిసిపోయే వ్యక్తి. ఆయన హెచ్.ఎస్సీ నుంచి వచ్చినాడు. నేను కేవలం విశారద పాసై డిప్.ఓ.ఎల్.లో చేరాను. నాకంటే పెద్దవాడైనా ఎన్నడూ తాను ఆధిక్యతను ప్రదర్శించలేదు. జాంబాగ్‌లోని వివేకవర్ధని సాయంత్రం కళాశాలకు వెళ్లాను. దివాకర్ల వారి ‘సాహిత్య సోపానాలు’ ఇవ్వమని అడిగాను. పుస్తకం ఇచ్చిన తర్వాత ‘చెన్నప్ప బాగున్నాడా?’ అని అడిగినట్లు జరిగిన విషయం తెలియజేశాడు.
గాయత్రి మేడం గారికి మనసులోనే ధన్యవాదాలర్పించాను. లోకంలో ఎవరితో ఎవరికి మై త్రిగాని, శత్రుత్వం గాని ఎట్ల ఏర్పడుతుం తో చెప్పలేం. తల్లిదండ్రులను, గురువులను, మంచి మిత్రులను కూడా పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే గాని పొందలే మేమో అని నా అభిప్రాయం. రామచంద్రారెడ్డి నాకు మిత్రుడిగా లభించడం పూ ర్వజన్మపుణ్య విశేషమేనని చెప్పాలి.మేము డిప్.ఓ.ఎల్ నుంచి ఎం.ఓ.ఎల్ వరకు చదవిన ఏడేళ్లు సారస్వత పరిషత్తు ప్రధానా చార్యులుగా కె.కె.ఆర్ గారే ఉన్నారు. 1975లో పరిషత్తు కళాశాల నుంచి వెలువడే ‘నెలవంక’ వార్షిక సంచికకు మేం ఇద్దరం జంటగా సంపాదకులమయ్యాం.
ఎప్పుడూ కలిసి ఉండే మమ్మల్ని చూసి ఈర్ష్య పడే విద్యార్థులుండవచ్చు గాని, ఒక రం కనిపించి మరొకరం కనిపించకపోతే, ‘ఏమిటి ఈరోజు మిత్ర ద్వయంలో ఒకరు కనిపించడం లేదు?’ అని మా గురువులు కూడా మమ్మల్ని అడిగేవారు. ఇంచుమించుగా మేమిద్దరం పరిషత్ ప్రాచ్య కళాశాలలోని లైబ్రరీలోని అన్ని తెలుగు గ్రంథాలు అధ్యయనం చేశాం. పాతపట్నంలోని ‘గుణవర్ధక్ లైబ్రరీ’, నాంపల్లిలోని ‘వేమన గ్రంథాలయం’, అఫ్జల్‌గంజ్‌లోని ‘రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం’, సుల్తాన్ బజార్‌లోని ‘కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిల యం’, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ని ప్రధాన గ్రంథాలయం మొదలైనవి మాకు జ్ఞాన విజ్ఞాన ఫలాలందించిన కల్పతరువులు.
వృత్తిలో నలభై ఏళ్లు..
ఎక్కడికెళ్లినా కలిసి వెళ్లడం మాకు అలవాటు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సామెత మాపట్ల సార్థకమైంది. అదృష్టవశాత్తు నాకు హైదరాబాదులో నలభై ఏళ్లు అధ్యాపక వృత్తిలో ఉండే అవకాశం లభించింది. ఇస్లామియా హైస్కూల్‌లో ప్రారం భమైన అధ్యాపనం, అధ్యయనంతో క్రమవికాసం చెంది ఉస్మానియా తెలుగుశాఖ అధ్యక్ష పదవిని అందుకునే వరకు కొనసాగింది. నేను ఏ స్థాయిలో ఉన్నా రామచం ద్రారెడ్డి నన్ను కలిసి అభినందించకుండా ఉండేవారు కారు.
మాకు పరిషత్తులో కామన్ గురువు డాక్టర్ డి.చంద్రశేఖర్‌రెడ్డి గారు. ఆయన మాకు భాషాశాస్త్రం బోధించేవారు. వారు చెప్తుండగానే రామచంద్రా రెడ్డి నోట్‌బుక్‌లో రాసుకునేవారు. అట్లా తయారుచేసిన నోట్స్ ‘విశ్వవిద్యాలయం లో మీకు ఉపయోగపడుతుంది’ అని చెప్పి శుద్ధ ప్రతినిచ్చారు. ఆ ప్రతి ఇంకా నా దగ్గరే ఉంది. అది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా స్నాతకోత్తర విద్యార్థులకు పాఠాలు చెప్పేటప్పుడు ఎంతో ఉపయోగపడింది. ఇప్పటికీ నా అభివృద్ధిని ఆకాంక్షి స్తూ, నా ఆరోగ్యాన్ని పరామర్శిస్తూ చెక్కు చెదరని 55 ఏళ్ల స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్న మిత్రునికి నా 62వ రచన ‘ఆర్షకవి చెన్నప్ప ఆత్మకథ’ను అంకితం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
వ్యాసకర్త: ఆచార్య మసన చెన్నప్ప,
సెల్: 9885654381