calender_icon.png 26 January, 2026 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనుల పండువగా రథసప్తమి

26-01-2026 12:00:00 AM

సూర్యక్షేత్రానికి భారీగా తరలివచ్చిన భక్తజనం

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని పర్వత శ్రేణుల మధ్య నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి ద్వాదశ ఆదిత్య క్షేత్రంలో ఆదివారం రథసప్తమి వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం ప్రాంతాలతో పాటు ఆంద్రా నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది.ఉదయం సుప్రభాత సేవ,అభిషేకం,అలంకరణ కార్యక్రమాలు జరిపారు. సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం కళ్ళారా దర్శించి తరించాలన్న భక్తులకు చివరకు నిరాశ ఎదురైంది.కానీ స్వామి దర్శనానికి మధ్యాహ్నం వరకు సుమారు 20వేల మంది భక్తులు క్యూ లైన్ లలో నిలుచున్నారు.కాగా క్షేత్రం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపాలు వెలిగించి పూజలు చేశారు.

అదేవిధంగా ఆలయంలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు.క్షేత్ర ఆవరణలోని రామకోటి స్తూపాలు, కార్యసిద్ధి వీర హనుమాన్ ఆలయాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సత్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.ఎస్త్స్ర సైదులు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలచే భజనలు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.సూర్యాపేట ఆర్టీసీ డిపో వారు ప్రతి 10నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సును ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొడ్డు ఇందిరా సోమరాజు,ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి,అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి,సీఐ నాగేశ్వర్ రావు,ఎస్త్స్రలు సైదులు,వెంకట్ రెడ్డి,క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్ స్వామి,వేద పండితుడు మార్తి శ్రీనివాసశర్మ,స్వామి వారి సేవకులు ఘనపురం నరేష్,బాలమురళీకృష్ణ, యాదగిరి, ఇంద్రారెడ్డి, జైపాల్ రెడ్డి, వినయ్, పూర్ణ, అర్చకులుభీంపాండే, అంకిత్ పాండే, శ్రీరామ్ పాండే, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.