26-01-2026 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 25, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చిన్న, పెద్ద ఆహార వ్యాపార సంస్థలకు ఫోన్ ద్వారా కొంతమంది వ్యక్తులు తమను ఆహార భద్రత శాఖకు చెందిన అధికారులుగా పరిచయం చేసుకుని అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జిల్లా ఆహార భద్రత శాఖ దృష్టికి వచ్చినట్లు జిల్లా ఆహార భద్రతాధికారి శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ఒక వ్యక్తి తనను ఫుడ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ నాయుడుగా పరిచయం చేసుకుంటూ మొబైల్ నంబర్ 8886397761 నుండి ఆహార వ్యాపారదారులకు ఫోన్ చేసి డబ్బులు కోరుతున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.
సంబంధిత వ్యక్తికి ఆహార భద్రత శాఖతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఆహార వ్యాపార సంస్థల యజమానులు ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మవద్దని, ఫోన్, యూపీఐ లేదా నగదు రూపంలో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దన్నారు. అధికారుల పేరుతో డబ్బులు అడగడం పూర్తిగా మోసంగా భావించాల్సిందిగా తెలియజేశారు.
ఆహార భద్రత శాఖకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, ఫీజులు కేవలం అధికారిక విధానంలో మాత్రమే వసూలు చేయబడ తాయ ని, వ్యక్తిగత ఫోన్ కాల్స్ ద్వారా ఎలాంటి చెల్లింపులు ఉండవని మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్ లేదా మోసపూరిత ప్రయత్నాలు ఎదురైనట్లయితే వెంటనే జిల్లా ఆహార భద్రత శాఖ, పాల్వంచలోని ఐడీఓసీ కార్యాలయం, రూమ్ నెంబర్ F-3 వద్ద సమాచారం అందించాలని వ్యాపారదారులకు శరత్ తెలిపారు.