25-08-2025 12:00:00 AM
నల్లగొండ, ఆగస్టు 24 (విజయక్రాంతి) : అది భువనగిరి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని కూనురు గ్రామం. పైగా యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలోని ప్రాంతం. దీంతో రియల్ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. అయితే ఈ రియల్ వ్యాపారం అన్నీ అనుమతులతో సజావుగా సాగితే.. వచ్చే నష్టమేమీ లేదు. కానీ నిబంధనలను తుంగలో తొక్కి అడ్డదారిలో రూ.కోట్లు కూడబెట్టేందుకు కొంతమంది అక్రమార్కులు ఏలాంటి అనుమతుల్లేకుండా పదుల ఎకరాల్లో భారీ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు.
అమాయకపు ప్రజలను రంగురంగుల బ్రోచర్లతో బురిడీ కొట్టించి అభివృద్ధి చేయని ప్లాట్లను అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇవేమీ తెలియకుండా ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు అనుమతుల కోసం కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి పోతున్నారు. ప్రధానంగా యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం తర్వాత భువనగిరిలో రియల్ బూమ్ ఆకాశాన్నంటింది.
దీన్ని ఆసరాగా చేసుకుని వందల ఎకరాల వ్యవసాయ భూమి ప్లాట్లుగా మారిపోయింది. తాజాగా ఓ కంపెనీ సైతం 13 ఎకరాల పంట భూములను ఏలాంటి అనుమతుల్లేకుండా వెంచర్లుగా మార్చి భారీ మోసానికి తేరలేపింది. ‘వెంచర్ వేసేయ్.. డబ్బులు దోచేయ్..’ అన్న చందంగా భువనగిరి మండలం కూనూరు గ్రామపంచాయతీ పరిధిలోని స్మాల్ టానర్స్ కోపరేటివ్ ఇండస్ట్రీయల్ లిమిటెడ్ గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా 13 ఎకరాల్లో భారీ వెంచర్‌ను ఏర్పాటు చేసింది.
13 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్..
భువనగిరి మండలంలోని కూనురు గ్రామంలో స్మాల్ టానర్స్ కోపరేటివ్ ఇండస్ట్రీయల్ లిమిటెడ్ పేరుతో కంపెనీ నడుస్తోంది. ఈ కంపెనీకి సంబంధించిన 13 ఎకరాల భూమిని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కనీసం గ్రామపంచాయతీకి కనీస సమాచారం ఇవ్వకుండా రియల్ వెంచర్‌గా తీర్చిదిద్దారు. కూనురు గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 17, 38, 45, 39ల్లో దాదాపు 13 ఎకరాలకు పైగా లేఔట్ వేశారు. ఇందులో కనీసం మట్టిరోడ్లను సైతం ఏర్పాటు చేయలేదు.
నామమాత్రంగా రాళ్లను హద్దులుగా చేసి గజాల లెక్కన రిజిస్ట్రేషన్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కానీ చర్యలు తీసుకునేందుకు అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్నా.. భారీ వెంచర్‌గా రూపుదిద్దుకుంటున్నా.. అధికార యంత్రాంగానికి ఇవేం పట్టకపోవడం కొసమెరుపు.
తూతూమంత్రంగా నోటీసులు..
అనుమతుల్లేకుండా వెంచర్ ఏర్పాటు చేస్తున్న స్మాల్ టానర్స్ కంపెనీ నిబంధనలకు తూట్లు పొడిచింది. సదరు కంపెనీ వెనుక పెద్దల హస్తం ఉండడంతో మమ్మల్ని ఎవ్వరూ ఏంజేయలేరంటూ బహిరంగంగానే చెబుతుండడం గమనారం. కూనురు గ్రామపంచాయతీ కార్యదర్శి తూతూమంత్రంగా సదరు కంపెనీ యాజమాన్యానికి జూలై 29న నోటీసులు ఇచ్చారు. 7 రోజుల్లోపు వెంచర్ ఏర్పాటుకు సంబంధించి అనుమతి పత్రాలు సమర్పించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
నోటీసులు అందిన వెంటనే సర్వే నంబరు 17, 38, 45, 39లో లేఔట్ పనులు నిలిపివేసి వెంచర్ ఏర్పాటును ఆపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు కంపెనీ యాజమాన్యం వెంచర్ పనులను నిలిపివేయకపోనూ అనుమతి పత్రాలను అందించలేదు. అయినా అధికారులు తదుపరి చర్యలకు దిగకపోవడం గమనారం. మరీ ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం స్పందించి లేఔట్ పనులను నిలిపివేస్తారో.. లేదో.. వేచిచూడాల్సిందే.