25-08-2025 12:00:00 AM
మఠంపల్లి, ఆగస్టు 24 : మఠంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎనిమిది నెలలుగా సూపరింటెండెంట్, మండల పంచాయతీ అధికారి పోస్టులు ఖాళీగా ఉండగా, మూడు గ్రామ పంచాయతీలకు సైతం కార్యదర్శులు ఇన్చార్జిలే ఉండడంతో గ్రామాలలో పాలన పడకేసింది. ప్రధానంగా ఎంపీడీవో కార్యాలయంలో ఉండే రెండు ప్రధాన పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండడంతో ఇటు ప్రజలు అటు కిందిస్థాయి అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
దీంతో ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల వ్యాప్తిచెంది డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్ వంటి వ్యాధులు వ్యాపించి వందల సంఖ్యలో వ్యాధుల భారీన పడుతున్నారు. దీంతో ప్రైవేట్ దవాఖానాలలో వేలకు వేలు ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వైపు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల పాలన కాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను గ్రామాలకు ప్రభుత్వం నియమించింది.
అయితే వారు ఒక్క రోజు కూడా గ్రామాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే కొందరు పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొందరు కార్యదర్శులు పని భారం ఎక్కువ కావడంతో విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నామని బాహాటంగానే చెబుతుండడం గమనార్హం.
ఇప్పటికైనా జిల్లా అధికారులు మండలం వైపు చూసి మండలానికి రెగ్యులర్ సూపరింటెండెంట్, ఎంపీఓను నియమించి కార్యాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. అలాగే మండలంలో ఇంచార్జి కార్యదర్శులు ఉన్న గ్రామపంచాయతీలకు వెంటనే పూర్తి బాధ్యతలతో కూడిన కార్యదర్శులు నియమించి గ్రామపాలనను గాడిలో పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.