calender_icon.png 13 August, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌కు రెడ్‌అలర్ట్

13-08-2025 01:29:54 AM

* ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా, సహాయం కోసం వెంటనే 040-29560521,9000113667, 9154170992 నెంబర్లలో సంప్రదించాలని సూచించింది.

  1. మూడు రోజులు అతిభారీ వర్షాలు 
  2.   20 సెంటీమీటర్ల వరకు కురిసే అవకాశం
  3. చాలా ప్రాంతాల్లో 10-15 సెం.మీ. పడే చాన్స్
  4. హైడ్రా కీలక హెచ్చరికలు జారీ
  5. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు: ఐఎండీ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): రానున్న మూడు రోజుల పాటు భాగ్యనగరాన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ(హైడ్రా) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, బుధవారం నుంచి శుక్రవారం వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తీవ్రమైన సూచనలు జారీ చేసింది.

నగర పరిధిలో, ముఖ్యంగా మేడ్చల్ జిల్లా , సైబరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా పేర్కొంది. చాలా ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, కొన్ని చోట్ల ఇది 20 సెంటీమీటర్ల వరకు కూడా చేరొచ్చని అంచనా వేసింది. ఇది నగరంలో తీవ్ర మైన జలమయానికి దారితీసే ప్రమా దం ఉందని హెచ్చరించింది.

బుధ, గురు, శుక్రవారాల్లో ప్రజలు అత్యవసర వైద్యం, నిత్యా వసరాలు మినహా ఇతర పనుల కోసం బయటకు రావొద్దని సూచించింది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని.. అనవసర ప్రయాణాలు చేయొద్దని చెప్పింది. ప్రయాణంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. లోతట్టు ప్రాం తాలు, నాలాల సమీపంలో నివసించే ప్రజ లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పే ర్కొంది. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. 

అతి నుంచి అత్యంత భారీవర్షాలు..

బుధ, గురు వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరించింది.

అలాగే కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, ము లుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వానలు పడుతాయంటూ రెడ్ అలెర్ట్ జారీ చేశారు.

హనుమకొండ, హైదరాబాద్, జనగామ, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడుతాయని.. ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, కరీంనగర్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్ర, శనివారాల్లోనూ రాష్ర్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంద ని వాతావరణ శాఖ తెలిపింది.