calender_icon.png 13 August, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యామ్ రోడ్డు పనుల్లో చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం

13-08-2025 01:18:50 AM

  1. రాష్ట్రాభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వాములు కావాలి
  2. ఆమోదం పొందిన పనులకు త్వరలోనే టెండర్లు: డిఫ్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): హ్యామ్ రోడ్డు పనుల్లో రాష్ట్రప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు అవకాశం కల్పిస్తుందని, కాంట్రాక్టర్లు కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ నాక్ ఆడిటోరియంలో మంగళవారం ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో కలిసి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఒక రాష్ట్రంలో ఎన్ని రోడ్లు అందుబాటులోకి వస్తే, రవాణా వ్యవస్థ అంత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. తద్వారా మారుమూల ప్రాంతాల అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు. తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’లో భాగంగా ఇన్‌ఫ్రా, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 7,947 కి.మీ మేర, రోడ్లు భవనాలశాఖ పరిధిలో 5,190 కి.మీ మేర రోడ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు.

క్యాబినెట్ ఆమోదం పొందిన ఈ పనులకు, త్వరలోనే టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. కాంట్రాక్టర్లకు ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు త్వరలో బ్యాంకర్లతోనూ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ పెద్దలు 1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకొని, రూ.45 వేల కోట్ల విలువైన పనులకు మాత్రమే టోకెన్లు జారీ చేశారని గుర్తుచేశారు.

ఆ బకాయిలు చెల్లించకుండా తమపై ఆర్థిక భారాన్ని మిగిల్చి వెళ్లారని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సంపద సృష్టిలో భాగస్వాములని ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ప్రభుత్వ వాటా 4ం శాతమని, ఆ మేరకు నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. మిగిలిన 60శాతం నిధులను కాంట్రాక్టర్లు వెచ్చిస్తారని స్పష్టం చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని, అలాంటి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు మరిన్ని రోడ్లు వస్తే, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ద్రవ్యోల్బణం, ఇతర సర్దుబాట్లు, కాంట్రాక్టర్ల పనితీరు ఆధారంగా వారికి చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేశారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనైనా రవాణా మార్గాలు బాగుంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తాయని పేర్కొన్నారు. సరైన రహదారులు ఉంటేనే అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు సులభంగా ప్రజలకు చేరుతాయని వివరించారు.

రోడ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం హ్యామ్ విధానానికే మొగ్గు చూపిందని, ఈ విధానంతో నిర్మాణ ఖర్చులో 40 శాతం మాత్రమే ప్రభుత్వంపై పడుతుందన్నారు. సమావేశంలో రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వికాస్‌రాజ్, ఎన్.శ్రీధర్, సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్‌అండ్‌బీ అధికారులు, బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.