calender_icon.png 29 December, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విప్లవ నేతకు రెడ్ సెల్యూట్

29-12-2025 01:31:16 AM

  1. పుల్లెంలలో గణేష్ ఉయికెకు వీడ్కోలు

కన్నీటి పర్యంతమైన బంధువులు, చిన్ననాటి స్నేహితులు                           

అశేష జనవాహిని మధ్య ముగిసిన అంత్యక్రియలు       

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జన సందోహం

కడసారి చూపునకు వచ్చిన వివిధ పార్టీల, సంఘాల నాయకులు

చండూరు, డిసెంబర్ 28 (విజయక్రాంతి): మావోయిస్టు కీలక నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అంత్యక్రియలు తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా, చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో ఆదివారం ఘనంగా ముగిశాయి. విప్లవ నేతకు వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు, సానుభూతిపరులు రెడ్ సెల్యూట్ చేశారు.

హనుమంతు అలియాస్ గణేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం 10 గంటల వరకు పుల్లెంలకు చేరుకున్నారు. కాగా పాక హనుమంతు అంత్యక్రియలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. దండకా రణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు నెట్వర్క్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గణేష్ గతంలోనే మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఈసారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో పోలీస్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. 

గణేష్ పార్దివ దేహం స్వగ్రామానికి చేరుకోవడంతో పుల్లెంల గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. గ్రామస్తులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే కాకుండా తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తండోపతండాలుగా గణేష్ మృతదేహాన్ని చూడటానికి పుల్లెంల గ్రామానికి వచ్చారు.  గణేష్ తో 45 సంవత్సరాలుగా ఎలాంటి సంబంధాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. 1961 లో జన్మించిన పాక హనుమంతు విద్యార్థి దశలో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు.

డిగ్రీ చదువుతున్న సమయంలో రాడికల్ విద్యార్థి సంఘాలతో సంబంధం ఏర్పడగా సుమారు 45 సంవత్సరాల క్రితం మావోయిస్టు ఉద్యమంలో అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్వగ్రామాన్ని విడిచి వెళ్లిన గణేష్, దశాబ్దాలపాటు కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించలేదని అధికారులు తెలిపారు. కాలక్రమేణా జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగిన గణేష్ సిపిఐ ( మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే గురువారం ఒడిశా రాష్ట్రం కాంధామూల్ జిల్లా గుమ్మా ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం విదితమే.

పుల్లెంల గ్రామంలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పాక హనుమంతు మృతదేహంపై పలువురు రాజకీయ నాయకులు, పలు సంఘాల నేతలు, మాజీ మావోయిస్టులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఆయన మృతి మావోయిస్టు ఉద్యమానికి తీరని లోటని  అభిప్రాయపడుతున్నారు.

అనంతరం పాక హనుమంతు చితికి ఆయన కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, మాజీ మావోయిస్టులు సమిష్టిగా నిప్పంటించారు. ఈ కార్యక్రమంలో నకిరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి అయిలయ్య, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్,  తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్, నల్లగొండ జిల్లా డిసిసి ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి,

మునగాల నారాయణరావు, పౌర హక్కుల సంఘం సభ్యులు , పూర్వ విప్లవ విద్యార్థి వేదిక నాయకులు విజయరామరాజు, ప్రొఫెసర్ లక్ష్మణ్,  నారాయణరావు, వివిధ పార్టీల నాయకులు నలపరాజు రామలింగయ్య, బొమ్మర గోని వెంకన్న, కోరిమి ఓంకారం, నలపరాజు సతీష్ వివిధ ప్రజాసంఘాల నేతలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

పాక హనుమంతుది బూటకపు ఎన్ కౌంటర్: గడ్డం లక్ష్మణ్  

పాక హనుమంతు అలియాస్ గణేష్ ది ముమ్మాటికీ బూటకపు ఎన్ కౌంటర్ అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్దంగా చట్టప్రకారం శిక్షించాలి తప్ప ఈ బూటక ఎన్కౌంటర్లు చేయడం నేరమని ఆయన ఖండించారు. హనుమంతును సజీవంగా పట్టుకొని కాళ్లు చేతులు విరిచి ఎన్కౌంటర్ చేశారన్నారు. అంత్యక్రియలకు పోలీసులు గ్రామంలో ప్రవేశించి ఆంక్షలు విధించి మైకులు,కరెంటును ఆపివేశారనీ, ఆయన అంత్యక్రియలు ఒక సాధారణ వ్యక్తివి జరిగినట్లే  జరపాలన్నారు. 

పీడిత ప్రజల కోసం తుది శ్వాస విడిచి మహానీయుడు: మాజీ ఎమ్మెల్యే  

చదువుకునే రోజుల్లో నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నాకు జూనియర్గా హనుమంతు ఉన్నాడు, హనుమంతు నేను పిడిఎస్యు విద్యార్థి సంఘంలో పనిచేశామని గుర్తు చేసుకున్నారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను నిర్మూలించేందుకు చేపట్టిన చర్యలను ఖండించారు. పేద ప్రజల కోసం పనిచేస్తున్న మావోయిస్టులను అరెస్టు చేసి జనజీవన స్రవంతిలో కలిపి విధంగా కృషి చేయాలి తప్ప.. ఎన్కౌంటర్లు చేసి ప్రాణాలు తీయడం కేంద్ర ప్రభుత్వానికి సబబు కాదన్నారు. యావత్తు ప్రజానీకం ప్రజల కోసం పనిచేసిన నాయకులను ఎప్పటికీ తమ గుండెల్లో పెట్టుకుంటారన్నారు.