27-12-2025 02:33:37 AM
సిట్ విచారణలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
ముగిసిన 14 రోజుల సిట్ కస్టోడియల్ విచారణ
ఇంటికి వెళ్లిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు
జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక
కేసీఆర్, హరీశ్‌కు త్వరలో నోటీసులు?
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ఎస్‌బీఐ చీఫ్‌గా ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది.? అందులోని ఆంతర్యం ఏమిటీ? అని సిట్ దర్యాప్తు బృందం అధికారులు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును ప్రశ్నించడంతో ఆ విష యం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే బాగా తెలుసని, ఆయననే అడగండి అంటూ ఎదురు ప్రశ్న వేసినట్లు తెలిసింది.
దీంతో ఈ కేసు దర్యాప్తు మాజీ సీఎం కేసీఆర్ వైపు మళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు అనుమతితో రెండు దఫాలుగా మొత్తం 14 రోజుల పాటు ఆయన్ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికా రులు..
కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. విచారణ గడువు ముగియడంతో శుక్రవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇంటికి పంపించి వేశా రు. విచారణ సమయంలో ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య లు దర్యాప్తును కొత్త మలుపు తిప్పాయి.
భద్రత విషయంలోనే హరీశ్‌ను కలిసా..
మాజీ మంత్రి హరీశ్‌రావుతో భేటీ వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా సిట్ ఆరా తీసింది. దీనిపై ప్రభాకర్ రావు బదులిస్తూ.. హరీశ్‌రావుకు ప్రాణహానీ ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఉండటంతో, ఆయనకు రక్షణ కల్పించే అంశంపై చర్చించేందుకే కలిసానని అంగీకరించినట్లు తెలిసింది. దీని ఆధారంగా త్వరలోనే హరీశ్‌రావు, అవసరమైతే కేసీఆర్‌కు కూడా సిట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కుమారుడు, బంధువులపైనా ఆరా..
కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే కాకుం డా, తద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలపైనా సిట్ దృష్టి సారించింది. బెదిరింపుల ద్వారా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్న భారీ మొత్తాలపై ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్ రావును, ఇతర బంధువులను కూడా అధికారులు విచారించారు. గతంలో 6వేల ఫోన్ నంబర్లు ట్యాప్ చేసి, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న కోణంలో వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అలాగే, ఈ కేసులో ఇతర నిందితులు తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావుల ను వేర్వేరుగా విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు.
జనవరి 16న సుప్రీం కోర్టుకు నివేదిక
కొత్తగా ఏర్పడిన సిట్ బృందానికి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ప్రభు త్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12 నుంచి 18 వరకు మొదటి దశలో, 19 నుంచి 25 వరకు రెండో దశలో ప్రభాకర్ రావును విచారించారు. ఈ 14 రోజుల విచారణ సారాం శాన్ని, సేకరించిన సాక్ష్యాధారాలను క్రోడీకరించి ఫైనల్ చార్జిషీట్‌లో పొందుపరచను న్నారు. జనవరి 16న ఈ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లయింది.