27-12-2025 02:32:31 AM
నూతన విధానానికి శ్రీకారం చుట్టిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): వార్షిక పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. తల్లిదండ్రుల ఫోన్లకు వారి పిల్లల ఇంటర్ హాల్‌టికెట్లను పంపించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలకు సుమారు 45 రోజుల ముందు నుంచి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు పంపనుంది. హాల్‌టికెట్‌లో నంబర్, పరీక్ష కేంద్రంతోపాటు ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో వివరాలుంటాయి. దీంతోపాటు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల హాల్‌టికెట్‌పై ఫస్ట్ ఇయర్ మార్కుల వివరాలను సైతం ఇవ్వనున్నారు.
దీంతో తమ పిల్లలు ఫస్ట్ ఇయర్‌లో ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు, ఎన్ని మార్కులొచ్చాయనే సమాచారం వారికి తెలుస్తుంది. కొంత మంది పిల్లలు ఫస్ట్ ఇయర్‌లో ఒకట్రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా కూడా తమ తల్లిదండ్రులకు చెప్పడం లేదు. ఆ ఫెయిల్ అయినా సబ్జెక్టులు, సెకండియర్ పరీక్షలు రాసే క్రమంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విధంగా సమాచారం ఇవ్వడం ద్వారా విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాయనున్నారు.