calender_icon.png 26 September, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార పరిశ్రమ రంగంలో రిలయన్స్ 40 వేల కోట్ల పెట్టుబడులు

26-09-2025 01:24:22 AM

  1. కర్నూల్ సహా పలు పట్టణాల్లో ఫుడ్ యూనిట్స్ ఏర్పాటు

ఈ మేరకు వరల్డ్ ఫుడ్ ఇండియా కుదిరిన ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశంలో పారిశ్రామిక దిగ్గజ సంస్థగా పేరొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమైంది. ఆహార పరిశ్రమ రంగంలో రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో భాగంగా ఈ అతిపెద్ద ఒప్పందం కుదిరింది.

ఒప్పందంలో భాగంగా ఏపీ కర్నూల్ జిల్లాలో ఓ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కులను స్థాపించనున్నట్టు ఒప్పందంలో పేర్కొన్నారు. రూ.1,500 కోట్లతో ఏపీలోకి కర్నూ లు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన కటోల్‌లో ఫుడ్, బేవరేజెస్ యూనిట్లను నెలకొల్పనున్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసేందుకు రిలయన్స్ కంపెనీ దూకుడు ప్రదర్శిస్తోంది.

కాంపా, ఇండిపెండెన్స్ పేరుతో కార్బొనేటెడ్ సాఫ్ట్‌డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను విక్రయిస్తోంది. వినియోగదారులకు అనుగుణంగా ఇతర ప్రొడక్ట్స్ తీసుకొచ్చేందుకు ట్యాగ్జ్ ఫుడ్స్ వంటి బ్రాండ్‌లనూ కొన్నది. వచ్చే ఐదేండ్లలో లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలన్నది తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ వెల్లడించారు.