17-01-2026 12:12:48 AM
గిగ్ వర్కర్లకు ప్రాణసంకటంగా మారిన పది నిమిషాల డెలివరీ నిబంధనను ఎత్తివేస్తూ క్విక్ కామర్స్ సంస్థలు నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని చెప్పవచ్చు. కేంద్రం ఆదేశాల మేరకు మంగళవారం బ్లింకిట్ సంస్థ తొలుత ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా బుధవారం స్విగ్గీ, జొమాటో డెలివరీ సంస్థలు కూడా బ్లింకిట్ బాటలోనే నడిచాయి. వేగవంతమైన డెలివరీల పేరుతో ఏజెంట్లపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఇటీవలే గిగ్ వర్కర్ల నుంచి ఆందోళనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 25న క్రిస్‌మస్ పర్వదినాన దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు మెరుపు సమ్మెకు దిగడం డెలివరీలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
గిగ్ వర్కర్ల సమస్యలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి ఒత్తిడి చేయడంతో పలు క్విక్ కామర్స్ సంస్థలు 10 నిమిషాల డెలివరీని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం, మిగిలిన డెలివరీ సంస్థలు కూడా అదే బాటలో నడవనుండడం సంతోషం కలిగించే అంశం. దాదాపు అన్ని ప్రధాన సంస్థలూ తమ అప్లికేషన్లనుంచి ‘పది నిమిషాల డెలివరీ’ ప్రమాణాన్ని ఉపసంహరించుకొని, డెలివరీ చేయగల కనిష్ఠ సమయాన్ని మాత్రం చూపిస్తున్నాయి. 10 నిమిషాల డెలివరీ మాటకు కట్టుబడి వేగంగా డెలివరీలు చేసే క్రమంలో చాలా మంది గిగ్ వర్కర్లు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత, కనీస ఆదాయ హామీ, స్పష్టమైన పని నిబంధనలు కల్పించకుండా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం న్యాయం కాదు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితుల దృష్ట్యా కఠినమైన డెడ్‌లైన్లు విధించడం ఎంతవరకు న్యాయమన్న విమర్శల నేపథ్యంలో క్విక్ కామర్స్ కంపెనీల వైఖరిలో మార్పు రావడం శుభసూచకం. భారత్‌లో గిగ్ ఎకానమీ అనేది వేగంగా విస్తరిస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. లక్షల మంది యువతకు ఇది ఉపాధిని కల్పిస్తున్నప్పటికీ భద్రత లేకపోవడం బాధాకరం. గిగ్ ఎకానమీలో యజమాని-, ఉద్యోగి మధ్య బంధం, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు గిగ్ వర్కర్లకు అందుబాటులో లేవు. జీతాల విషయంలో కూడా స్పష్టత ఉండదు.
ఒక రోజు ఆదాయం బాగుంటుంది, మరో రోజు ఆదాయం తగ్గవచ్చు. ఎక్కువ గంటలు పని చేసినా, దానికి తగిన ప్రతిఫలం లభించని సందర్భాలు చాలానే ఉన్నాయి. డెలివరీ ఆలస్యం అయితే రేటింగ్ తగ్గిపోతుందనే భయంతో, బోనస్ కట్ అవుతుందనే ఆందోళనతో, గిగ్ వర్కర్లు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి బైకులు నడుపుతున్నారు. ఈ ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవిగా కాకుండా, ఒక వ్యవస్థాత్మక ఒత్తిడి ఫలితంగా చూడాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా గిగ్ వర్కర్ల సమస్యలు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చాయి.
గిగ్ వర్కర్ల భద్రత, ఆదాయం, హక్కుల గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే కర్ణాటక గిగ్ వర్కర్ల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావడం ముదావహం. మరోవైపు తెలంగాణ కూడా గిగ్ వర్కర్ల భద్రతకు సంబంధించిన బిల్‌ను ఇటీవలే అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర వేయడం అభినందించాల్సిన అంశం. అంతిమంగా గిగ్ వర్కర్లకు పది నిమిషాల డెలివరీ ఎత్తేయడం మంచి సంకేతమే అయినప్పటికీ భద్రతా పరంగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే పోరాటం పరిపూర్ణమవుతుంది.