18-12-2025 06:10:38 PM
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మండలంలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల పట్టాలను అందించాలని కోరుతూ టియుడబ్ల్యూజే (ఐజెయు) ఆధ్వర్యంలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిజాన్ని నమ్ముకొని నిస్వార్ధంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పాలకులు మాత్రం హామీలు ఇస్తున్నారు తప్పా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బయన్న అన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలోనైనా తమకు ఇళ్ల పట్టాలను వెంటనే పంపిణీ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం సానుకూలంగా స్పందిస్తూ ఇళ్లపట్టాలను పంపిణీ చేసేందుకు త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ మండల అధ్యక్షుడు మెండే వెంకన్న, ప్రధాన కార్యదర్శి పోకల కరుణాకర్, కోశాధికారి చెరుపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకన్న పాల్గొన్నారు..