04-01-2026 12:00:00 AM
విశ్వనాథ్ కార్తికేయకు రూ.౩లక్షల చెక్కు అందజేత
హైదరాబాద్, జనవరి 3(విజయక్రాంతి): ప్రతిష్టాత్మక ’ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ గ్రహీత, ‘రెసోనెన్స్’ విద్యార్థి పడకంటి విశ్వనాథ్ కార్తికేయను రెసోనెన్స్ విద్యా సంస్థ హైదరాబాద్‌లోని సుచిత్ర క్యాంపస్‌లో ఘనంగా సత్కరించింది. రెసోనెన్స్ తరఫున రూ. మూడు లక్షల చెక్కును కార్తికేయకు అందజేసింది. జాతీయ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు, ‘సెవెన్ సమ్మిట్స్ ఛాలెంజ్’ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా గుర్తింపు పొందినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విశ్వనాథ్ కార్తికేయ ఈ పురస్కారం అందుకున్నారు.
17 ఏళ్ల విశ్వనాథ్ కార్తికేయ ప్రస్తుతం రెసోనెన్స్ సుచిత్ర క్యాంపస్‌లో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ విశ్వనాథ్ కార్తికేయకు లభించిన బాల పురస్కారంతో రెసోనెన్స్ కుటుంబం ఎంతో గర్వపడుతుందన్నారు. అంకితభావం, క్రమశిక్షణ, లక్ష్య స్పష్టతతో కూడిన విద్యా సాధనకు ఈ విజయం నిదర్శనమన్నారు. ప్రతి విద్యార్థిలో ఉన్న శక్తిని సానుకూల శక్తిగా మార్చాలన్న దిశగా కృషి చేస్తూ ఉంటామన్నారు.
ఈ సందర్భంగా విశ్వనాథ్ కార్తికేయ మాట్లాడుతూ ఈ గుర్తింపు పొందడం నాకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. భారత రాష్ట్రపతికి, తల్లిదండ్రులకు, అండగా నిలిచిన రెసోనెన్స్ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. మరింతగా కష్టపడి పని చేయడంలోనూ, భవిష్యత్తులో సానుకూలంగా ముందుకు నడవడంలోనూ ఈ సత్కారం ఒక ప్రేరక శక్తిగా నిలుస్తోందని తెలిపారు.విశ్వనాథ్‌కు అత్యంత సన్నిహిత మిత్రుడు మాట్లాడుతూ విశ్వనాథ్ దృష్టి లక్ష్యం వైపు ధృఢంగా ఉంటుందన్నారు. వినయం, కష్టపడే తత్వం అధికమన్నారు. ఆయన ఈ గౌరవాన్ని అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తన ప్రయా ణం మాకు ఎంతో ప్రేరణ ఇస్తుందన్నారు.