13-10-2025 01:21:00 AM
కాబుల్, అక్టోబర్ 12: తమ దేశ రాజధాని కాబుల్‌తో పాటు ఓ మార్కెట్‌పై పాకిస్థాన్ బాంబు దాడులకు పాల్పడిందని.. ఈ నేపథ్యంలో పొరుగు దేశ దళాలే లక్ష్యంగా ప్రతికార దాడులు చేపట్టామని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ఈ దాడుల్లో తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని, మరో 30మంది గాయపడ్డారని వెల్లడించారు.
ఇస్లామాబాద్ పదే పదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదులను ఆశ్రయం కల్పించొద్దని హెచ్చరిం చింది. కాగా, ఇటీవల అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.
తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ లక్ష్యంగా పాక్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు ఆ దేశ రక్షణ విశ్లేషణ సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే, ఈ దాడులపై ఇస్లామాబాద్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్నప్పుడు ఈ దాడులు జరిగాయి.