03-12-2024 01:23:59 AM
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): విద్యావ్యవస్థలో సమూల మార్పు లు చేపడుతూ తన మార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. విద్యాశాఖను తనవద్దే పెట్టుకున్న రేవంత్ రెడ్డి...సీఎంగా బాధ్యతలు చేపట్టినకాన్నుంచి భారీ మార్పులు తీసుకొచ్చారు. తొలి ఏడాదిలోనే అర లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కలను సాకారం చేశారు.
గత పదేళ్లలో తీసుకోని నిర్ణయాలు ఒక్క ఏడాదిలోనే పూర్తి చేశారు. ఏడాది పొడవునా.. రిక్రూట్‌మెంట్‌లు, యామకపత్రాలు అందజేసి తొలి ఏడాదినే ఉద్యోగాల ఏడాదిగా మార్చారు. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్‌ను తీసుకొచ్చి..ఏడాది పొడవునా జాబ్ మేళాను ప్రకటించారు. ప్రజా పాలనలో తెలంగాణ యువత భవిత మలుపు తిరిగింది.
తొలి ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల మేళా నిర్వహించింది. ఉద్యోగాల భర్తీలో రేవంత్ సర్కారు కొత్త రికార్డు నమోదు చేసింది. ఏ రాష్ర్టంలో లేనివిధంగా మొదటి ఏడాదిలోనే 53 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గడిచిన పదేండ్లలో ఉద్యోగాల భర్తీ లేక విసిగి వేసారిన నిరుద్యోగుల జీవితాల్లో సరికొత్త మార్పు తెచ్చింది.
నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్..
అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువ త కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి వారి సమస్యలపై ఫోకస్ పెట్టారు. పేపర్ లీకేజీలతో అపవాదు మూటగట్టుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)ని ప్రక్షాళన చేశారు. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పరీక్షలు, ఫలితాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం తొలగించింది.
పదేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేనందున యువత నష్టపోకుండా వయో పరిమితిని సడలించింది. గత ప్రభు త్వ నిర్లక్ష్యంతో రద్దయినవి, వాయి దా పడ్డవి, పెండింగ్‌లో పెట్టిన ఫలితాలన్నింటినీ విడుదల చేసింది. ఏడాది పొడవునా ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించింది.
నిరంతర నియామక ప్రక్రియ..
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో వార్షిక జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించింది. ఉద్యోగ నియామకాలను నిరంతర ప్రక్రియగా నిర్వహించే వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. బీఆర్‌ఎస్ హయాంలో పదేండ్లలో ఒకేసారి డీఎస్సీ వేసి 7,857 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే.. కొత్త ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించింది.
ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా అభ్యర్థులకు ఏడాది పొడవునా వివిధ శాఖల్లోని ఉద్యోగ నియామక పత్రాలను అందించిన దాఖలాలు లేవు. కొత్త సంప్రదాయాన్ని రేవంత్ సర్కార్ తెర లేపింది.
రెసిడెన్షియల్ సొసైటీ ల పరిధిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపిమొత్తం 8,304 మందికి నియామక పత్రాలను ప్రజా ప్రభు త్వం అందించింది.
విజయవంతంగా పోటీ పరీక్షలు..
గత బీఆర్‌ఎస్ హయాంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన పోటీ పరీక్షల ను రేవంత్ సర్కార్ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ -1 పరీక్షను రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్-3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది.
టీజీపీఎస్సీ వివిధ నోటిఫికేషన్‌ల ద్వారా ఈ ఏడాదిలో 3,393 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు, రవాణా శాఖ పరిధిలో 96 మంది ఏఎంవీఐలకు నియామక పత్రాలు అందించారు. పెండింగ్‌లో ఉన్న గ్రూప్-4 తుది ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 8,143 మంది ఎంపికైన అభ్యర్థులకు ప్రజా ప్రభుత్వం తొలి విజయోత్సవాల సందర్భంగా నియామక పత్రాలు అందించనుంది.
కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు ఉన్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం అధిగమించింది. ఎంపికైన 16,067 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్వర్యంలో 7,094 మంది స్టాఫ్‌నర్స్‌ల నియామకాలు విజయవంతం గా పూర్తి చేసింది.
వీరిలో 6,956 మందికి నియామక పత్రాలు ఇచ్చింది. ఇటీవలే 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్‌నర్స్) పోస్టులు, 633 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంకా 5,378 పోస్టుల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి.
ఉద్యోగాల భర్తీ ఇలా..
తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 3,393
మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్బీ) 6,956
తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీజీపీఆర్బీ) 16,067
తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్
రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్‌ఈఐఆర్బీ) 8,304
పాఠశాల విద్య (డీఎస్సీ) 10,006
ఇతర సంస్థలు 441
ఈనెలలోనే గ్రూప్ 4 నియామక పత్రాలు 8,143
మొత్తం నియామకాలు 53,310