29-10-2024 01:39:41 AM
మాజీ ఎమ్మెల్యే రసమయి
మానకొండూర్, అక్టోబరు 28 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డివి ప్రతీకార రాజకీ యాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. సీఎంకు రాజకీయంగా కొట్లాడడం చేతకాకనే కేసీఆర్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తిమ్మాపూర్ మండలం లోని ఇందిరానగర్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాను మానకొండూర్ నియోజకవర్గం నుంచి 10 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించానని, తాను ఏనాడూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను వేధించలేదని స్పష్టం చేశారు. కానీ, ప్రస్తుతం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నాడని, కమీషన్ల కోసం పలువురిని వేధిస్తున్నాడని, అతడి ఆగడాలను త్వరలో తాను బయటపెడతానని హెచ్చరించారు.
తిమ్మాపూర్ మండలంలోని ఎస్సీల కోసం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ పక్కనే అరుంధతి పేరుతో మండపం నిర్మించామని, ఆ మండపం తాళాన్ని ఎమ్మెల్యే అనుచరుడు వద్ద ఎందుకుంటాయని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, మాజీ సర్పంచ్‌లు కొమురయ్య, మెంగాని రమేష్, నాయకులు పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్ పాల్గొన్నారు.