calender_icon.png 16 September, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష

16-09-2025 12:07:26 AM

కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు

రేగొండ, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఐడిఓసి కార్యాలయంలో బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ రాష్ట్ర ప్రజల సాంప్రదాయ, సంస్కృతికి ప్రతీక అని, మహిళల పూల పండుగ అని తెలిపారు. జిల్లావ్యాప్తంగా తొమ్మిది రోజులు జరగనున్న నవరాత్రి ఉత్సవాలు, అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేసే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఘాట్ లు గుర్తించి విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని, అన్ని శాఖల ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసే రహదారులు, వీధి లైటింగ్, త్రాగునీరు, పరిశుభ్రత, భద్రతా చర్యలు, వైద్య సేవలు వంటి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ లు, పంచాయతీ సెక్రటరీలు, స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. వీధులలో, ప్రధాన కూడళ్ళలో వీధిలైట్లు వెలిగేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సింగరేణి ఎస్ ఓ టు జి ఎం రవీంద్ర పాల్గొన్నారు.