calender_icon.png 16 September, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూ నివారణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి

16-09-2025 12:06:42 AM

 అధికారులు గ్రామాలలో పర్యటించాలి

- జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలు

సిద్ధిపేట, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి):గడిచిన 2,3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కా ర్యక్రమాలను పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కె. హైమావతి మండల ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం వల్ల దోమల వ్యాప్తి అధికమవుతుందని, అందువల్ల ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు.

మున్సిపాలిటీలలో కమిషనర్లు ఈ కార్యక్రమాలను క్రమపద్ధతిలో అమలు చేయాలని ఆదేశించారు. స్వస్త్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో మహిళలు, బాలికలకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు ప్రత్యేక నిపుణులచే వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంక్షేమ, డీఆర్డీఓ, విద్య తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ధన్ రాజ్ కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

స్వచ్ఛతాహే సేవా 2025 లో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు గ్రామాల వారీగా శ్రమదానం, వ్యర్థాల తొలగింపు, పర్యావరణహితమైన పండుగల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్యను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్, జయదేవ్ ఆర్య కలిసి స్వచ్ఛతాహే సేవా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషన్ సభ్యులు కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులతో ఆర్టీఐ చట్టంపై చర్చించగా, 4 గంటల నుండి 6 గంటల వరకు పెండింగ్ కేసులపై హియరింగ్ జరగనుంది. పీఐఓలు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.