calender_icon.png 24 August, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాయింట్లను కబళించే రూమటాయిడ్ ఆర్థరైటిస్

24-08-2025 12:11:21 AM

ప్రస్తుత బిజీ ప్రపంచంలో మన అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడంతో శరీరం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. దీని ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రధానంగా తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం తగినంత మోతాదులో ఉండడం లేదు. దీని ఫలితంగా రోగనిరోధక శక్తి తక్కువ కావడంతో కాళ్ల, కీళ్ల నొప్పులు వస్తున్నాయి. దానిలో ప్రధానమైనది రూమటాయిడ్ ఆర్థరైటిస్.

రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంగవైకల్యం నివారించాలంటే ముందస్తు గుర్తింపే మంత్రం. నిత్యం ఎదురయ్యే జాయింట్ నొప్పులను వయస్సు ప్రభావంగా, పనిచేసిన మోతాదుకు తగిన ఫలితంగా, లేదా వాతావరణ మార్పుల వల్లనేనని చాలామంది ఊహిస్తారు. కానీ దీని వెనక రూమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ) అనే దీర్ఘకాలిక వ్యాధి దాగి ఉండవచ్చు అనే విషయం మరచిపోతుంటారు. ఇటీవల కాలంలో, హైదరాబాద్ వంటి నగరాల్లో వృద్ధులతో పాటు యువతలోనూ ఆర్‌ఏ కేసులు పెరిగిపోతున్నాయి. ఇది కేవలం సాధారణ జాయింట్ నొప్పి కాదు. ఇది శరీరంలో తానే తాను దాడి చేసే ఆటోఇమ్యూన్ వ్యాధి. ముందుగానే గుర్తించి చికిత్స చేయకపోతే, ఈ వ్యాధి జీవన నాణ్యతను బాగా దెబ్బతీయడమే కాక, శాశ్వత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.

రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి?

ఇది శరీరంలో రోగని రోధక వ్యవస్థ తప్పుగా స్పందించి, ఆరోగ్యమైన జాయింట్లను దాడి చేయడమే. ముఖ్యంగా చేతులు, మణికట్టు, కాళ్ల వేళ్లు వంటి చిన్న జాయింట్లలో వాపు, నొప్పి, మంకు, ఆకృతి మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల రోజు వారి పనులు చేయడంలో తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 1% మందికి ఆర్‌ఏ ఉంటుందని అంచనా. మహిళలకు ఇది పురుషులకంటే మూడింతలు అధికంగా కనిపిస్తోంది.

నిర్ధారణకు అవసరమైన పరీక్షలు

రక్తపరీక్షలు: రూమటాయిడ్ ఫ్యాక్టర్ (ఆర్‌ఎఫ్), యాంటీ -సీసీపీ

ఇమేజింగ్: ఎక్స్-రే లేదా అల్ట్రాసౌండ్

ఈ పరీక్షల ద్వారా ఆర్‌ఏని తొందరగా గుర్తించి, ఆ దశలోనే చికిత్స మొదలు పెడితే దీర్ఘకాలిక నష్టం నుంచి రక్షణ సాధ్యమవుతుంది.

తొలిదశలోనే చికిత్స ఎందుకు కీలకం?

మొదటి సంవత్సరం లోపల ఆర్‌ఏని గుర్తించి, సరైన మందులు ప్రారంభిస్తే జాయింట్ల నష్టం పూర్తిగా నియంత్రించవచ్చు. ఆలస్యంగా గుర్తిస్తే నెమ్మదిగా జాయింట్ల పనిచేసే సామర్థ్యం తగ్గిపోతూ, శాశ్వతంగా డ్యామేజ్ అవుతుంది. ఆర్‌ఏ ప్రభావం కేవలం జాయింట్లకే కాకుండా శ్వాసకోశాలు, కంటి ఆరబాటు, రక్తనాళాల వాపు, గుండె సంబంధిత సమస్యలు లాంటివి కూడా కలుగవచ్చు.తాజా ఔషధ పురోగతుల వల్ల ఎమ్‌ఏఆర్‌ఎస్ (మార్స్), బయోలాజిక్స్ వంటి మందులతో ఆర్‌ఏని సమర్థంగా నియంత్రించగలుగుతున్నాం.

హైదరాబాద్‌లో ఆధునిక రుమటాలజీ సేవలు

హైదరాబాద్ నగరం ఇప్పుడు రుమటాలజీ రంగంలో కీలక కేంద్రంగా ఎదుగుతోంది. మా క్లినిక్‌లో పూర్తి రక్తపరీక్షలు, ఇమేజింగ్ సదుపాయాలు, వ్యక్తిగత అవసరాలకు తగిన చికిత్స ప్రణాళికలు, జీవనశైలి మార్పులపై కౌన్సిలింగ్, ఫిజియోథెరపీ, పోషణ మార్గదర్శనం లభిస్తాయి. ఈ సమగ్ర విధానంతో ఆర్‌ఏ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ఈ లక్షణాలుంటే వెంటనే నిపుణుడిని కలవండి

- అనేక జాయింట్లలో వాపు, నొప్పి

- ఉదయం మంకు ఎక్కువగా ఉండటం

- నెల రోజులకిపైగా నిరంతర నొప్పి

- ఇలాంటి సూచనలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా రియుమటాలజిస్టును సంప్రదించండి.

ఆర్‌ఏ ఉన్నా ఆరోగ్యంగా, చురుకుగా జీవించవచ్చు

ఆర్‌ఏ అనేది జీవితాంతం బాధపడే వ్యాధి కాదు. సరైన సమయంలో గుర్తించి, సమర్థవంతమైన చికిత్సతో చాలా మంది రోగులు సాధారణ జీవితం గడుపుతున్నారు. సమస్య ఏమిటంటే  మనం జాయింట్ నొప్పులను సాధారణం అని తీసుకోవడం. ఇదే ధోరణిని మార్చాలి. రూమటాయిడ్ ఆర్థరైటిస్‌ను చిన్నచూపు చూడకండి. ముందుగానే తెలుసుకుని చర్య తీసుకుంటే, మంచి ఫలితాలు సాధ్యమే.

గుర్తించడంలో సహాయపడే లక్షణాలు

-ఒక నెలకు పైగా కొనసాగుతున్న జాయింట్ నొప్పులు

-ముఖ్యంగా చేతులు, పాదాల్లో ఉన్న అనేక జాయింట్లలో వాపు

-ఉదయం మేలుకున్న వెంటనే 30 నిమిషాలకుపైగా శరీరంలోని కీళ్లు గట్టిపడటం లేదా కదలకుండా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే, రూమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్‌ఏ) అవకాశం ఉందని అనుమానించి వెంటనే రుమటాలజిస్టును సంప్రదించాలి.

డాక్టర్ సౌమ్య కొత్త ఎంబీబీఎస్(గాంధీ) ఎండీ జనరల్ మెడిసిన్(ఉస్మానియా) డీఎం రుమాటలజీ& క్లినికల్ ఇమ్యూనాలజీ(నిమ్స్) కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్