10-05-2025 11:29:40 PM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల,(విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే రైతుల ధాన్యంలో ఎలాంటి కోతలు విధించవద్దని రైస్ మిల్లర్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తి మండల కేంద్రం, మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, కోనరావుపేట మండలం బావుసాయిపేట, గోవిందరావుపేట తండా, వట్టిమల్ల, గొల్లపల్లి, నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తనిఖీ చేశారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ళ తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. లారీ కాంట్రాక్టర్ లు ప్రతి సెంటర్ కు లారీలను సకాలంలో ఏర్పాటు చేయాలని, కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అకాల వర్షాలకు తడవకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. సకాలంలో లారీల సరఫరా సకాలంలో చేయకుండా జాప్యం వలన అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే వారికి సంబంధిత లారీల కాంట్రాక్టర్ కు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని లేనియెడల వారిపై ఎస్మ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, ఐకేపీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.