25-11-2025 12:00:00 AM
సీపీఐ జిల్లాకార్యదర్శి పంజాల శ్రీనివాస్
ముకరంపురా, నవంబరు 24 (విజయ క్రాంతి): జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ కోరారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్లో రైతులు పండించిన వరి పంట దిగుబడి రాక అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారని, చేతికి వచ్చిన పంటను విక్రయించేందుకు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు.
రైస్ మిల్లర్లు ప్రభుత్వం కేటాయించిన కోటా అయిపోయిందని సాకులు చెబుతున్నారని, జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా మిల్లర్లు అనేక చోట్ల కొనుగోలు నిలిపివేశారని, నూక, నల్ల గింజల పేరుతో బస్తాకు కిలో కటింగ్ పోను లోడ్ బస్తాలకు 4 నుండి 5 బస్తాలు కటింగ్ చేస్తున్నారని, దీనివల్ల రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా అధికారులు వెంటనే జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, కే.సురేందర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, ఉమ్మెoత్తల రవీందర్ రెడ్డి, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.