calender_icon.png 18 July, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులు హరించారు

18-07-2025 12:50:05 AM

  1. నాటి ప్రభుత్వంపై కోర్టును ఆశ్రయిస్తాం
  2. ఫోన్ ట్యాపింగ్ చేసినవారిని కఠినంగా శిక్షించాలి
  3. సిట్ ముందు వాంగ్మూలం అనంతరం తీన్మార్ మల్లన్న
  4. కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు
  5. కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ చేసిన దుర్మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అతి పెద్దదని, వ్యక్తి గత హక్కులను హరించిన కేసీఆర్ కుటుంబంపై, నాటి అధికారులపై చర్యల కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ఆయన  గురువారం సిట్ అధికారుల ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఇదే కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ విచారణ అనంతరం మీడియాతో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ అరాచకం బయటపడిందని, లేకపోతే అది ఇప్పటికీ కొనసాగేదేనని అన్నారు.

సామాన్యులను మావోయిస్టులుగా ముద్రవేసి, తనతో పాటు అనేక మంది, చివరకు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇందులో బాధితుడేనని, గత ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలు ఈ ప్రభుత్వంలో జరగవనే సంకేతాలు ప్రజలకు ఇవ్వాలన్నారు.  కేసీఆర్‌తో పాటు ఈ నేరానికి పాల్పడిన వారందరికీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశానని, మరికొంత సమాచారం త్వరలోనే పంపిస్తానన్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని ముందే కోరబోమని, సిట్ ఏ మేరకు న్యాయం చేస్తుందో చూస్తామని, ముందుగానే బద్నాం చేయడం సరికాదని పేర్కొన్నారు.

24న విచారణకు రండి..

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు పలువురు నేతలకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గతంలో తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని ఆరోపించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు సిట్ అధికారులు నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 24న హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

గతంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, తన ఫోన్‌తో పాటు, తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ సిట్ విచారణకు హాజరవుతారా లేదా మరో తేదీని కోరుతూ వివరణ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఇచ్చే వాంగ్మూలం ఈ కేసు విచారణలో కీలకం కానుందని భావిస్తున్నారు.