calender_icon.png 2 December, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సర్పంచ్’ నుంచే ప్రస్థానం

02-12-2025 12:47:57 AM

ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ఉద్దండుల రాజకీయ ప్రస్థానం 

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా పేరుగాంచిన పలువురు తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ పదవి నుంచి ప్రారంభించడం విశేషం. రాజకీయాల్లో రాణించడానికి గ్రామ సర్పంచ్ పదవి అప్పట్లో కీలకంగా తోడ్పాటు అందించింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పాత తరం నేతలు ఎన్.యతిరాజారావు, అజ్మీరా చందులాల్, జగన్నాయక్ కూడా సర్పంచ్ గానే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చట్టసభలకు ఎన్నికై మంత్రి పదవులు చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా బాధ్యతలు కూడా నిర్వహించారు.

రామసహాయం సురేందర్‌రెడ్డి 

మాజీ ఎంపీ, ఎమ్మెల్యే రామ సహాయం సురేందర్‌రెడ్డి 1959లో (ఆర్‌ఎస్) మరిపెడ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించారు. డోర్నకల్ ఎమ్మెల్యేగా, వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు. విశేషమేమిటంటే డోర్నకల్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక దఫా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం. నాలుగు దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన ప్రస్థానం ఏకబిగిన కొనసాగింది. 

రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డిఎస్ రెడ్యా నాయక్ ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై తర్వాత మరిపెడ సమితి అధ్యక్షుడిగా, ఎంపీపీగా, తదుపరి డోర్నకల్ ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సైతం గుండ్రాతి మడుగు సర్పంచిగా ఎన్నికై తదుపరి డోర్నకల్ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ సైతం ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సైతం సర్పంచ్ గానే తొలుత రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ

ఇక ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి 1981 నుంచి 88 వరకు అమీనాబాద్ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సైతం గ్రామ సర్పంచ్ గానే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన స్వగ్రామమైన బుద్ధారం గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత రాజకీయంగా నిలబడి అంచలంచలుగా ఎదిగి ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.