కిలోమీటర్‌కో గుంత.. ప్రయాణానికి చింత

27-04-2024 01:49:39 AM

భూపాలపల్లి రూట్‌లో 20 కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా రోడ్డు

టీ ఫైబర్ వర్క్ పేరుతో గుంతల తవ్వకాలు

నిత్యం ఏదోఒక చోట ప్రమాద ఘటనలు

పట్టించుకోని అధికారులు, కాంట్రాక్టర్లు 

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రోడ్డులో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు తవ్వి నెలల తరబడి వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. జయశంకర్ భూపా లపల్లి జిల్లా కేంద్రం నుంచి మేడారం వెళ్లే రోడ్డు మార్గంలో రాంపూర్ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న అటవీ ప్రాంతం లో మెయిన్ రోడ్డుపై టీ ఫైబర్ వర్క్ కోసం కాంట్రాక్టర్లు గుంతలు తవ్వి వదిలేశారు. సుమారు 6 నెలలుగా వాటిని పూడ్చకుండా వదిలేయడంతో ఆ దారిలో నిత్యం వాహనాల ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి.

టీ ఫైబర్ పైప్‌లైన్ గుంతలు రోడ్డుకు ఆనుకొని తవ్వించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ మెయిన్ రూట్ రద్దీగా ఉంటుంది. ఇటీవల నాగారానికి చెందిన ఆలూరి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి గుంతలో పడి కోమాలోకి వెళ్లగా హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స  తీసుకొని ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. ఆయన ఆస్పత్రి ఖర్చులు సుమారు రూ.5 లక్షల వరకు అయ్యాయని కుటుంబ సభ్యులు తెలిపారు. నెల రోజుల కిందట మహాముత్తారానికి చెందిన బాదావత్ రాజునాయక్ గుంతలో పడి గాయాలపాల య్యాడు. వారం కిందట మహాముత్తారానికి చెందిన కొమ్మెర రమేశ్ అనే వ్యక్తి కమలాపూర్ వద్ద గుంతలో పడి కోమాలోకి వెళ్లాడు. కమలాపూర్ మధ్య పది మందితో వెళ్తున్న ఆటో గుంతలో పడి బోల్తా పడడంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టర్, అధికారులు గుంతలను పూడ్చి ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.