calender_icon.png 17 May, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ పనులు షురూ

17-05-2025 12:55:19 AM

మహబూబాబాద్, మే 16 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ప్రకటించిన కేసముద్రం మున్సిపాలిటీలో అంబేద్కర్ సెంటర్ నుండి కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు వరకు నాలుగు కిలోమీటర్ల మేర నూతనంగా చేపట్టిన రోడ్డు విస్తరణను 80 అడుగులకు ఫిక్స్ చేశారు.

తొలుత 120 అడుగులకు విస్తరించాలని యోచించగా చాలామంది ఇండ్లు కోల్పోయే పరిస్థితి ఎదురవుతుందని ఆందోళనకు దిగడంతో 80 అడుగులకు కుదించినట్లు ఆర్ అండ్ బి ఏ ఈ ప్రశాంత్ తెలిపారు. 20 కోట్ల రూపాయల అంచనాలతో చేపట్టే రోడ్డు పనులకు సంబంధించిన వివరాలను ఏఈ తెలిపారు.

నాలుగు కిలోమీటర్ల మీద మధ్యలో మీటరున్నర మేర డివైడర్ ఉంటుందని, అందులో లైటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఇరువైపులా బీటీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ, ఫుట్ పాత్ కూడా నిర్మిస్తామని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలంలో అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. చెట్ల తొలగింపు తర్వాత రోడ్డుకు అవసరమైన స్థలాన్ని గుర్తించనున్నారు.

అనంతరం రోడ్డు క్రాసింగ్ డ్రైనేజీ, వరద నీరు ప్రవహించే కాలువల నిర్మాణం, రోడ్డు ఎత్తు పల్లాలను సరి చేయడం తదితర పనులను చేపట్టడం జరుగుతుందని ఏఈ తెలిపారు. గత కొంతకాలంగా విస్తరణ కోసం ఎంత స్థలం కేటాయించాలని అంశంపై నెలకొన్న సందిగ్ధం తొలగిపోవడంతో రోడ్డు పనులు ఊపందుకొనున్నాయి.