05-11-2025 12:13:32 AM
-నాపై కొన్ని ఆన్ లైన్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నయ్
-రోడ్డు పనులను పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకుంటా
-ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల, నవంబర్ 4: మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోవడం బాధాకరమని, ఎన్జీటీలో కేసు కారణంగానే బీజాపూర్ హైవే పనుల్లో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ.. 2005లో ఆలూరులో ఉపాధి హామీ పనుల ప్రారంభానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చినపపుడు అప్పటి సీఎం వైఎస్సార్ ఈ హైవే గురించి ప్రపోజల్ పెట్టారని గుర్తు చేశారు.
తర్వాత 2011 నవంబర్ లో కిరణ్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ట్రాన్స్ పోర్టు మినిస్టర్కు ప్రపోజల్ పెట్టారని, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి కూడా కృషి చేశారన్నారు. గత ప్రభుత్వంలో మంజూరు వచ్చిన తర్వాత మన్నెగూడ నుంచి బీజాపూర్ వరకు రోడ్డు పనులు పూర్తయ్యాయని, ఎన్టీటీలో పర్యావరణ వేత్తలు కేసు వేయడంతో అప్పాజంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయని తెలిపారు. అప్పటి నుంచి గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా స్టే ఎత్తివేయించేందుకు కృషి చేశాయని, చివరగా సీఎం రేవంత్ రెడ్డి హయాంలోనే కేసు వెకేట్ అయ్యిందని చెప్పారు. ఈ మేరకు అక్టోబర్ 31న పనులు కూడా ప్రారంభించామని, అంతలోనే ప్రమాదం జరగడం బాధాకరమన్నారు.
అయితే కొన్ని ఆన్ లైన్ పత్రికలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. ఈ రోడ్డుపై వారంలో ఇద్దరు ముగ్గురు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని.. సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అప్పా జంక్షన్ నుంచి చిట్టెం పల్లి వరకు రోడ్డు పనులు పూర్తి చేసే బాధ్యత తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అక్కడి నుంచి మన్నెగూడ వరకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చూసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాములు, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బూర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.