25-12-2025 02:21:58 AM
మంచిర్యాల, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీస్ నాకాబందీని నిర్వహించారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ఒకేసారి నాకాబంది నిర్వహించి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల వివరాలు, వారు వెళ్లే ప్రదేశం వివరాలు, వాహనాలలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి నాకాబంధి నిర్వహించారు.
వాహనాలను ఆపి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, పొల్యూషన్ తదితర ధ్రువ పత్రాలను పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేని వారు, వాహన ధ్రువ పత్రాలు లేని వారిపై పోలీస్ అధికారులు కేసులు నమోదు చేసి, జరిమానా విధించారు. అలాగే వారికి రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు.
శాంతి భద్రతల పరిరక్షణకు
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు నాకా బందీ నిర్వహిస్తున్నాం. జిల్లాలో అక్రమ రవాణా, ప్రభుత్వ నిషేధిత పదార్థాలు రవాణా, అనుమానిత వ్యక్తుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలను అరికట్టడానికి, అనుమానితులు, దొంగిలించబడిన వస్తువులు, సరైన పత్రాలు లేని వాహనాలను పట్టుకోవడానికి,
గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడంతో పాటు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఇతర నేరాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఈ ప్రక్రియను రాబోయే రోజుల్లో కూడా నిర్వహించి, తనిఖీలు మరింత కఠినంగా కొనసాగిస్తాం. ప్రజలు పోలీసులకు సహకరించాలి.
ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల