10-09-2025 01:15:23 AM
నాలుగైదు రోజుల్లో వరద ముంపునకు చెక్
పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువును తలపించిన అమీర్పేట మెట్రో స్టేషన్ పరిసరాల్లో వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికార యంత్రాంగం నడుం బిగిం చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మానవ ప్రమేయంతో సాధ్యంకాని పూడికతీత పనులను అత్యాధునిక రోబో టెక్నాలజీతో చేపట్టారు.
మంగళవారం ఈ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. గత వారం కురిసిన కుండపోత వానలకు అమీర్పేట ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారు లు సంయుక్తంగా వరద ముంపునకు గల కారణాలపై లోతైన అధ్యయనం చేశారు. మెట్రో స్టేషన్ కింద ఉన్న ప్రధాన రహదారి క్రింద నిర్మించిన బాక్సు డ్రైన్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ లైన్లు పూర్తిగా పూడికతో నిండిపోయి, గట్టిపడి రాళ్లలా మారినట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలో, సంప్రదాయ పద్ధతుల్లో తొలగించడం కష్టసాధ్యమైన ఈ పూడికను రోబో టెక్నాలజీ సహాయంతో తొలగించాలని నిర్ణయించారు. రోబో యంత్రం, సొరంగ మార్గాల్లో మట్టిని తొలగించినట్లుగా, డ్రైన్లలో గట్టిపడిన పూడికను పగలగొట్టి బయటకు తీసుకువస్తుందని తెలిపారు.