06-07-2025 12:30:38 AM
మనీలాండరింగ్ కేసంటూ బెదిరింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): నగరంలో మరో సైబర్ మోసం వెలుగుచూసింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వృద్ధుడిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఏకం గా రూ.53 లక్షలు కాజేశారు. అమీర్‌పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడు మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అమీర్‌పేటలో నివాసముంటున్న 77 ఏళ్ల వృద్ధుడికి గత నెల 18న ఓ అపరిచిత నంబ ర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ఢీల్లీ డీసీపీ రాజీవ్‌కుమార్‌నంటూ పరిచయం చేసుకున్నాడు. “మీపై మనీలాండరిం గ్ కేసు నమోదైంది. అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. మీ బ్యాంకు ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేస్తాం” అంటూ బెదిరించాడు.
ఆపై, సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్లుగా ఒక నకిలీ ఆర్డర్ కాపీని చూపిం చి, ఖాతాలను ఫ్రీజ్ చేయకుండా ఉండాలంటే సహకరించాలని నమ్మబలికాడు. తీవ్ర భయాందోళనకు గురైన వృద్ధుడు.. తనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని వేడుకున్నాడు. ఇదే అదునుగా భావించిన నేరగాళ్లు వృద్ధుడి ఖాతాలోని నగదును వారి అకౌంట్‌కు బది లీ చేయాలని సూచించారు.
తనిఖీ చేసి, మీపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారించుకున్న తర్వాత తిరిగి నీ ఖాతాలోనే జమ చేస్తామని మాయమాటలు చెప్పారు. వాటి ని నమ్మిన వృద్ధుడు.. వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు విడతలవారీగా మొత్తం రూ.53 లక్షలు బదిలీ చేశాడు.
నగదు బదిలీ అయిన వెంటనే సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ కట్ చేసి, ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యా దు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.