18-08-2025 12:20:59 AM
కొమురవెల్లి, ఆగస్ట్ 17 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. శ్రావణమాసంలో చివరి ఆదివారం కావడంతో మల్లన్న దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. భక్తులకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికిగంటకు పైగా సమయం పట్టింది. ఆదివారం ఉదయం నుంచి ఆలయ క్షేత్రంలో భక్తుల కోలాహాలం మొదలైంది.
ముందుగా భక్తులు స్వామివారి కోనేట్లో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. భక్తులు ముఖమాండపం వద్ద గంగిరేణి చెట్టు కింద పట్నాలు వేసి బోనాలు చెల్లించి, మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా కొంతమంది భక్తులు స్వామివారికి అభిషేకాలు, కల్యాణోత్సవంలో పాల్గొని, భక్తితో వేడుకున్నారు.
గుట్ట పైనున్న ఎల్లమ్మ తల్లి బోనం చెల్లించి, ఓడి బియ్యం పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు. శ్రావణమాసం చివరి సోమవారం రోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అన్న పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు.
ఉచిత ప్రసాద వితరణ
దేవాదాయ ధర్మాదాయ సూచన మేరకు ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తులకు ఆలయ సిబ్బంది ప్రసాదాన్ని అందజేశారు.
గట్లమల్యాలలో కన్నులపండువగా బోనాలు
నంగునూరు, ఆగస్టు 17: శ్రావణమాసం చివరి ఆదివారం సందర్భంగా నంగునూరు మండలం, గట్లమల్యాల గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతలకు నైవేద్యం సమర్పించారు.గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడింది.డప్పుల చప్పుళ్లు, పోతరాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పోచమ్మ,దుర్గమ్మలకు నైవేద్యాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ శ్రేయస్సు కోసం, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకున్నారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.