3 నుంచి 4 ఎకరాల వరకు రైతు భరోసా
మూడో విడతలో 6.39 లక్షల మందికి లబ్ధి
రైతుల ఖాతాల్లో రూ.1330.32 కోట్లు జమ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో 3 నుంచి 4 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో గురువారం రూ.1330.32 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు, 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన రైతుభరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా విడతల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటికే మొదటి, రెండు దశలలో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, మూడో రోజు 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకుగాను 90.04 లక్షల ఎకరాల సాగుభూమికి రూ.5402.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.






