17-11-2025 12:00:00 AM
స్పిన్ ఉచ్చులో భారత్ విలవిల
-సౌతాఫ్రికా సంచలన విజయం
-93 రన్స్‌కే కుప్పకూలిన భారత్
-సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు 1 ఆధిక్యం
కోల్‌కత్తా, నవంబర్ 16 : సొంతగడ్డపై భారత్‌కు మరో పరాభవం.. గత ఏడాది కివీస్ చేతిలో వైట్‌వాష్ అవమానం తర్వాత మరోసారి టీమిండియా బోల్తా పడింది. సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఘోరపరాజయం పాలైంది. 124 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చేతులెత్తేసింది. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేక కుప్పకూలింది. ఫలి తంగా 15 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా భారత్‌లో తొలి టెస్ట్ విజయాన్ని రుచి చూసింది.
అదే సమయంలో స్పోర్టింగ్ పిచ్ అంటూ స్పిన్ పిచ్ తయారు చేయించుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ 2025 సైకిల్‌లో కీలక మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. నిజానికి ఈడెన్ గార్డెన్స్‌లో తొలిరోజు నుంచే బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఆరంభంలో కాస్త పేసర్లకు అనుకూలించినా రెండోరోజు నుంచి మాత్రం స్పిన్నర్లు చెలరేగిపోయారు. ఇరు జట్లలోనూ స్పిన్నర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి.
పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ కావడం, విపరీతంగా టర్న్ అవ్వడం చూసి ఇరు జట్ల బ్యాటర్లు షాక్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు . 100 పరుగుల లోపు టార్గెట్ ఉంటే పర్లేదు అది దాటితే అంత ఈజీ కాదని కూడా అంచనా వేశారు. తీరా చివరికి అదే నిజమైంది. ఓవర్‌నైట్ స్కోర్ 93/7తో మూడోరోజు ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా కాసేపు నిలకడగా ఆడింది. దీనికి కారణం సఫారీ జట్టు సారథి బవుమానే. టెయిలెండర్లతో కలిసి అద్భుతంగా పోరాడాడు.
బోస్చ్‌తో కలిసి 44 పరుగుల కీలక భాగస్వామ్యం సఫారీ స్కోరును 150 దాటించింది. ఈ క్రమంలో బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. లంచ్ బ్రేక్‌కు కొద్దిసేపటి ముందు సిరాజ్,బుమ్రా సఫారీ టెయిలెండర్ల కథ ముగించడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 153 రన్స్‌కు ఆలౌటైంది. బవుమా 55 (136 బంతుల్లో 4 ఫోరు)్ల పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా 4 , కుల్దీప్ 2, సిరాజ్ 2 , బుమ్రా 1, అక్షర్ 1 వికెట్ పడగొట్టారు.
ఇలా వచ్చి అలా వెళ్లారు
124 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయడం ఈ పిచ్‌పై అంత ఈజీ కాదని భారత్‌కు కూడా తెలుసు. అలా అని అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే రెండు ఇన్నింగ్స్‌లోనూ సౌతాఫ్రికా స్కోర్లు 150 దాటడమే దీనికి నిదర్శనం. ఈ పిచ్‌పై ఎలా ఆడాలో కూడా బవుమా చూపించాడు.
అయితే భారత బ్యాటర్లు మాత్రం ఆరంభం నుంచే చేతులెత్తేశారు. జైశ్వాల్ (0), రాహుల్(1). జురెల్(13). పంత్ (2), జడేజా (18) పరుగులకే ఔటయ్యారు. స్పిన్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టంగానే ఉన్నప్పటకీ కాసేపు ఓపికను ప్రదర్శించలేకపోయిన భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వాషింగ్టన్ సుందర్(31), అక్షర్ పటేల్ (28) తప్పిస్తే మిగిలిన వారంతా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. టెస్ట్ ఫార్మాట్‌కు తగ్గట్టు షాట్లను ఎంపిక చేసుకుని కాసేపు క్రీజులో నిలబడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పైగా గాయంతో గిల్ మ్యాచ్‌కు దూరమవడంతో భారత్ 9 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఔటైన తర్వాత అక్షర్ పటేల్ పోరాడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.
కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో వరుసగా 4,6,6 కొట్టిన అక్షర్‌ను సఫారీ స్పిన్నర్ అదే ఓవర్లో ఔట్ చేయడంతో భారత్ కథ ముగిసింది. సిరాజ్ 9వ వికెట్‌గా ఔటవడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 93 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన సఫారీ స్పిన్నర్ హార్మర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో సౌతాఫ్రికా 1 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ గుహావటి వేదికగా నవంబర్ 22 నుంచి మొదలవుతుంది.
స్కోర్లు :
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 159
భారత్ తొలి ఇన్నింగ్స్ : 189
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : 153 ( బవుమా 55, బోస్చ్ 25; జడేజా 4/50, సిరాజ్ 2/2 )
భారత్ రెండో ఇన్నింగ్స్ : 93 (వాషింగ్టన్ సుందర్ 31 , అక్షర్ పటేల్ 26: హార్మర్ 4/21, జెన్సన్ 2/15, కేశవ్ మహారాజ్ 2/37)