17-09-2025 01:46:26 AM
నాగార్జునసాగర్, సెప్టెంబర్ 16 విజయ క్రాంతి: ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ప్రవాహం పెరగటంతో మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 14 క్రష్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాలలో తిరిగి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం ఎగువ జలాశయాలన్ని ఇప్పటికే నిండుకుండల మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విసుదల చేస్తుండటంతో ఒక్క సారిగా సాగర్ జలాశయం కు వరద ప్రవాహం పెరిగింది.
దీనితో మంగళవారం మధ్యాహ్నం డ్యామ్ 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.సాయంత్రానికి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగటంతో మరో 8గేట్లను మొత్తం 14గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,11,048 క్యూస్సేక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు ఎన్‌ఎస్పీ అధికారులు.ఈ సీజన్లో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయడం 4వ సారి కావడం విశేషం.
ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు క్రష్ట్ గేట్లు మరియు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 1,62,318 క్యూస్సేక్కుల నీటిని నాగార్జునసాగర్ జలాశయానికి విడుదలచేస్తున్నారు. దీనితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 588.40 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 307.2834 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 33,048 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 9500 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాల్వద్వారా 6022 క్యూసెక్కుల నీటిని ,ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని,లోలేవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.రిజర్వాయర్ నుండి మొత్తం 1,62,328 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.