calender_icon.png 15 August, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాలయ గగనాన్ని తాకే ప్రయత్నం.. భూక్యా యశ్వంత్‌కు సంపంగి గ్రూప్ సహకారం

14-08-2025 10:42:52 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఉల్లిపల్లె భుక్యా తండాకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ తన కృషి, పట్టుదలతో కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. పర్వతారోహణపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న యశ్వంత్, క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటూ, ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతని లక్ష్యం హిమాలయ శిఖరాన్ని అధిరోహించడం. ఈ కలను సాకారం చేసేందుకు అవసరమైన పరికరాలు, ప్రత్యేక శిక్షణ, ప్రయాణ ఖర్చులు మొదలైన వాటి కోసం ఆర్థిక సహాయం అందించడానికి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Sampangi Group of Companies) ముందుకొచ్చింది. సంస్థ చైర్మన్ రమేష్ సంపంగి ఆధ్వర్యంలో, ఎమ్.డి & సీఈఓ సురేష్ సంపంగి ద్వారా రూ.1 లక్ష ఆర్థిక సాయం యశ్వంత్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా సురేష్ సంపంగి మాట్లాడుతూ, "ప్రతిభ, పట్టుదల కలిగిన యువతకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం. యశ్వంత్ లాంటి క్రీడాకారులు, పర్వతారోహకులు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించి, దేశానికి గౌరవం తీసుకురావాలి. మా సహాయం అతనికి విజయానికి దారితీయాలి అని కోరుకుంటున్నాము" అన్నారు.సహాయం అందుకున్న యశ్వంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ "సంపంగి గ్రూప్ ఇచ్చిన ఈ సహాయం నాకు మరింత ఉత్సాహం, నమ్మకం ఇచ్చింది. హిమాలయ శిఖరాన్ని అధిరోహించి, మన తెలంగాణ, మన భారత దేశానికి గౌరవం తెచ్చేలా కృషి చేస్తాను" అని సంకల్పబద్ధంగా చెప్పాడు. స్థానిక ప్రజలు, గ్రామ పెద్దలు, క్రీడా సంఘాలు యశ్వంత్ విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, అతని పర్వతారోహణ పయనానికి శుభాకాంక్షలు తెలిపారు.